జనాభా పట్ల మోదీకి ఎందుకు ఆందోళన?

12 Sep, 2019 17:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న అధిక జనాభాను అరికట్టాల్సిన అవసరం ఉందని, అధిక జనాభా అభివద్ధికి ఆటంకం అని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు. అంతేకాకుండా చిన్న కుటుంబం కలిగి ఉండటం దేశభక్తిలో భాగమే అని కూడా చాటి చెప్పారు. ఆరేడు దశాబ్దాల అనంతరం దేశంలో పెరుగుతున్న జనాభా గురించి ప్రధాన మంత్రి మాట్లాడడం మొదటి సారి అవడం వల్ల జనాభా నియంత్రణకు జాతీయ స్థాయిలో ఓ చట్టాన్ని తీసుకొస్తారన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. 

ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు నేడు దేశం అధిక జనాభా సమస్యను ఎదుర్కొంటుందా ? 1981 జనాభా (సెన్సెస్‌) లెక్కల నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సెన్సెస్‌లలోనూ జనాభా వద్ధి రేటు తగ్గుతూ వస్తోందన్న విషయమే స్పష్టమైంది. 1991 నుంచి 2001 మధ్య దేశ జనాభా 21.5 శాతం పెరగ్గా, 2001 నుంచి 2011 సంవత్సరాల మధ్య జనాభా 17.7 శాతం పెరిగింది. ఆ తర్వాత సెన్సెస్‌ జరగలేదు. కానీ 2018–2019 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆర్థిక సర్వేలో జనాభా వద్ధి రేటు 2021 నుంచి 2041 మధ్య 12. 1 శాతం ఉంటుందని అంచనా వేశారు. 

భారత్‌లో దేశ జనాభా వృద్ధి రేటు ఏడాదికి ఒక్క శాతం మాత్రమే ఉందని ఐక్యరాజ్య సమితిలోని జనాభా విభాగం లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇరాన్, చీలీ, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ దేశాల కన్నా భారత్‌లో జనాభా వృద్ధి రేటు తక్కువ ఉందని ఆ లెక్కలు పేర్కొన్నాయి. దేశంలో జనాభా వద్ధి రేటు తగ్గడానికి ప్రజల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడమే ప్రధాన కారణం. 1971లో భారతీయ మహిళ సగటున 5.2 శాతం పిల్లలను కలిగి ఉండగా, అది 2017 నాటికి 2.1 శాతానికి పడిపోయింది. ఒకప్పుడు దేశ జనాభా వద్ధి రేటును సగటున 2.1 నియంత్రించాలని, అందుకు భారీ ఎత్తున కుటుంబ నియంత్రణా ఆపరేషన్లను నిర్వహించాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం భావించింది. 

ఇప్పుడు ఎలాంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అవసరం లేకుండా ప్రకతి సిద్ధంగా జనాభా వృద్ధి రేటు పడిపోయింది. జనాభా వృద్ధి రేటు తగ్గడం వల్ల నేడు మగవారితో పోలిస్తే మహిళల సంఖ్య బాగా తగ్గింది. ఈ కారణంగా జనాభా వృద్ధి ‘రిప్లేస్‌మెంట్‌ (ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన)’ రేటు కనీసం 2.2 ఉండాలని భావించారు. అంతకన్నా తగ్గి పోవడం వల్లనే దేశంలో మహిళల సంఖ్య బాగా తగ్గిందన్నది నిపుణుల అంచనా. ఐక్యరాజ్య సమితి కూడా భారత్‌లో జనాభా వృద్ధి రేటును కనీసంగా 2.2 ఉండాలని కోరుకుంటోంది. 

2021 సంవత్సరం నాటికి దేశంలో జనాభా వృద్ధి రేటు 1.8 శాతానికి పడిపోతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనాలు తెలియజేస్తున్నాయి. ఆ లెక్కన దేశానికి కావాల్సిన జనాభా కన్నా బాగా పడిపోతోంది. దీనివల్ల స్త్రీ, పురుషుల సంఖ్య మధ్య కూడా వ్యత్యాసం మరింత పెరిగి కల్లోల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండే యూపీ, బీహార్‌లలో కూడా ఆడపిల్లల సంతానం తగ్గిపోవడం ఆందోళనకరమైన విషయం. 

చైనాలో కూడా ఇప్పుడు సంతోనోత్పత్తి రేటు 1.7 శాతానికి పడిపోయింది. అందుకని వారు కూడా ఇప్పుడు ‘కుటుంబానికి ఒక్కటే సంతానం’ అనే విధానాన్ని పునర్‌ పరిశీలించాలని భావిస్తున్నారు. తమ దేశాల్లో తక్కువ సంతాన వృద్ధి రేటు పట్ల బెల్జియం, డెన్మార్క్, నార్వే దేశాలు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత దేశంలోని ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించక పోవడం పట్ల వారి జనాభా నానాటికి పెరుగుతోందని, హిందువుల సంఖ్య తగ్గుతోందని సంఘ్‌ పరివార్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హిందూ కుటుంబాలు నలుగురేసి పిల్లలను కనాలని కూడా సంఘ్‌ నాయకులు పిలుపునిచ్చిన సందర్భాలు ఉన్నాయి.

మరి అలాంటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ జనాభా నియంత్రణ గురించి ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. తన ప్రభుత్వం హయాంలో నానాటికి పడిపోతున్న ఆర్థిక వృద్ధి రేటును జనాభా నియంత్రణతోని సమతౌల్యం చేయాలనుకుంటున్నారా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని ముస్లింలలో కూడా జనాభా వృద్ధి రేటు పడిపోతోంది. 1992–93 సంవత్సరంలో ముస్లిం మహిళల్లో సంతానోత్పత్తి రేటు సగటున 4.41 శాతం ఉండగా, ఇప్పుడది 1.17 శాతానికి పడిపోయింది. 

మరిన్ని వార్తలు