చేత్తోనే ఎందుకు తినాలి?

14 May, 2016 15:13 IST|Sakshi
చేత్తోనే ఎందుకు తినాలి?

పూర్వకాలంనుంచీ అవలంబిస్తున్న సంస్కృతీ, సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత ఉన్నట్లు అనేకసార్లు రుజువైంది. పాతకాలంవారు పాటించిన ప్రతి పద్ధతి వెనుకా  సైన్స్ దాగున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భోజనం చేయడం విషయంలో ప్రస్తుతం అవలంబిస్తున్న ఆధునిక పద్ధతులకు కేరళ వాసులు మాత్రం నేటికీ దూరంగానే ఉన్నారు. భోజనం చేసేందుకు స్పూన్లు, ఫోర్కులు వాడకుండా నియమంగా చేత్తో కలుపుకొని తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ అలవాటు వెనుక అంతరార్థం ఆరోగ్యమేనంటున్నారు.

ఆహార పదార్థాలను చేతులతో కలిపి తినడంవల్ల శరీరానికే కాక, మనస్సుకు, ఆత్మకు కూడ బలాన్ని చేకూరుస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా భోజనానికి వాడే అరటి ఆకు అనుభవం వెనుక వేద జ్ఞానం కూడ ఇమిడి ఉందంటున్నారు. భారతీయ సంప్రదాయ భోజన విధానంలో చేత్తో కలుపుకొని తినడం వెనుక అనేక రకాల ఆరోగ్య రహస్యాలున్నట్లు కేరళలో కొలువైన రిసార్ట్ లోని ఛెఫ్ లు చెప్తున్నారు. కేరళ ఉత్తర కాసర్గోడ్ జిల్లాలోని 26 ఎకరాల్లో సుందరమైన, సద్గుణాలు కలిగిన పాకశాస్త్ర పరిజ్ఞానంతో కూడిన రిసార్ట్ ను తాజ్ బెకాల్ కు చెందిన వివంతా ఛెప్స్ అభివృద్ధి పరిచారు. ముఖ్యంగా కేరళ సంప్రదాయ వంటకాలతో కూడిన భోజనాన్ని, చేత్తో తినడం వల్ల కలిగే ప్రయోజనాలను, లాభాలను పాశ్చాత్యులకు సైతం  వివరిస్తూ, తినే విధానాన్ని పద్ధతిగా నేర్పిస్తున్నారు. చేతులతో తినడం వెనుక వేదజ్ఞానం ఉందని నిరూపిస్తూ... వారు స్వాధీనం చేసుకొన్న ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లోని వివరాలను,  కాగితంపై ముద్రించి అక్కడ అందుబాటులోకి తెచ్చారు.

ఆయుర్వేద గ్రంథాల్లోని వివరాల ప్రకారం మన చేతి, కాళ్ళ వేళ్ళు వాహక నాళానికి మూలాలుగా పని చేస్తాయని, ముఖ్యంగా బొటన వేలు వల్ల కలిగే అగ్న.. జీర్ణక్రియకు సహకరించే స్వభావం కలిగి ఉంటుందని చెప్తున్నారు. మిగిలిన నాలుగు వేళ్ళలో చూపుడు వేలు వాయువును, మధ్యవేలు ఆకాశాన్ని, ఉంగరంవేలు భూమిని, చిటికెన వేలు నీటికి మూలకాలుగా వ్యవహరిస్తాయని అందుకే చేతి వేళ్ళతో ఆహార పదార్థాలు కలుపుకొని తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుందని అక్కడి కాగితాల్లోని వివరాల ఆధారంగా వివరిస్తున్నారు. దీనికి తోడు ముఖ్యంగా శాకాహార సంప్రదాయ భోజనానికి వాడే అరటి ఆకులో కూడ ఎన్నో సద్గుణాలు ఉన్నాయని అక్కడి ఛెఫ్ లు చెప్తున్నారు. అంతేకాక భోజనాపికి వాడే ముడి బియ్యంలో కూడ కీళ్ళనొప్పులు, అల్సర్లతో పాటు అనేక రకాల నరాలకు సంబంధించిన రోగాలను నివారించే శక్తి ఉంటుందని చెప్తున్నారు. ఇంతటి ప్రాశస్త్ర్యం కలిగిన సంప్రదాయ భోజనానాన్ని చేత్తో తినేందుకు ఇప్పుడు విదేశీయులు సైతం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు