ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?

5 Aug, 2016 16:11 IST|Sakshi
ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?

దుబాయ్: దూకండి... దూకండి... బయటకు దూకండి! లగేజీని వదిలేయండి...ముందు మీరు బయటపడండి, బయటకు జారిపోండి! తిరువనంతపురం నుంచి దూబాయ్‌కి చేరుకున్న ఎమిరేట్స్ విమానం బుధవారం విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికులను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు ఇవి. ఓ పక్క ప్రమాదం ముంచుకొస్తున్నా ప్రయాణికులు మాత్రం తమ లగేజీలను వెంట తీసుకెళ్లేందుకే ప్రయత్నించిన విషయం తెల్సిందే. కొంత మంది తమ ఖరీదైన లాప్‌టాప్‌ల గురించి వెతుక్కోవడం కూడా ఓ వీడియో ఫుటేజ్‌లో కనిపించింది.
 
ఇలాంటి విపత్కర సమయాల్లో 90 సెకండ్లలో విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించడం విమానం సిబ్బంది బాధ్యత. ఎందుకు ఇలా 90 సెకండ్లలోనే ఖాళీ చేయించాల్సి ఉంటుందంటే. ఆ తర్వాత విమానంలో మంటలు తీవ్రమవుతాయనే విషయాన్ని పలు అధ్యయనాల ద్వారా వెల్లడైనట్లు వైమానిక నిపుణుడు ఆశ్లీ న్యూన్స్ తెలిపారు. అందుకనే ఎమిరేట్స్ విమాన సిబ్బంది నిర్దేశిత సమయంలో ప్రయాణికులను ఖాళీ చేయించేందుకు అవసరమైన హెచ్చరికలు చేస్తూ వచ్చారు. చివరకు తమ లగేజీలను తీసుకొని ప్రయాణికులు విమానాన్ని ఖాళీ చేశారు. అందుకు నిమిషంపైనే పట్టింది. రన్‌వేపై జారిపోతున్న విమానం ఇంజన్ నుంచి మంటలు చెలరేగడం కూడా 1.23 సెకండ్ల వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. అంటే అర నిమిషం లేటైనా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలేసేవే. ఇలా ప్రాణం మీదకు వచ్చినప్పుడు కూడా మానవులు తమ బ్యాగ్‌లు, లాప్‌ట్యాప్‌లు, పాస్‌పోర్టులు, పర్సులు, ఇంటి తాళం చేతుల కోసం ఎందుకు వెతుకుతారు? ప్రాణంకన్నా వస్తువులపై మమకారం ఎక్కువా?

ఒక్క ఎమిరేట్స్ విమానం విషయంలోనే ఇది జరగలేదు. గతేడాది సెప్టెంబర్ నెలలో బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం లాస్ వెగాస్ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కూడా ప్రయాణికులు ఇలాగే వ్యవహరించారు. 2013, జూలై నెలలో ఆసియాన విమానం శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో క్రాష్ ల్యాండింగ్‌కు గురైనప్పుడు కూడా ప్రయాణికులు తమ లగేజ్‌ల కోసం ఇలాగే వెంపర్లాడడం కనిపించింది.

మానవుడి నైజమే ఇంత! అని ఒక్కమాటలో సమాధానం చెప్పవచ్చునేమోగానీ ఈ విషయంలో మానవ మేథస్సుపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను కంప్యూటర్ ద్వారా విశ్లేషించడం సాధ్యం కాదు. ఎందుకంటే జీవన్మరణ సమస్యను అందులో సృష్టించలేం. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఎమిరేట్స్ విమానం ఫుటేజ్ వైమానిక సిబ్బంది ‘సేఫ్టీ డ్రిల్స్’కు ఎంతో ఉపయోగపడగలదు. ఇక ముందు ప్రయాణికులకు కూడా ఎలాంటి శిక్షణ ఇవ్వాలో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు