కేరళలో ఎందుకీ వరదలు?

20 Aug, 2018 18:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో భారీ వరదలకు అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇందుకు కారణం ఏమిటని ఎవరిని ప్రశ్నించిన ‘భారీ వర్షాలు’ అని సమాధానం ఇస్తారు. భారీ వర్షాలకు కారణం ఏమిటని అడిగితే అల్పపీడనం అనో, పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు వల్లనో అనో సమాధానం ఇస్తారు. ఇక వర్షాలు ఎక్కువ పడినా, తక్కువ పడినా ‘ఎల్‌ నైనో’ లేదా ‘లా నైనో’ ప్రభావమని ఇటు ప్రభుత్వం అటు అధికార యంత్రాంగం చెబుతోంది. ఇందులో సగం మాత్రమే ఉంది. ప్రభుత్వం విధాన లోపం కారణంగానే వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎక్కువగా ప్రాణ నష్టం సంభవిస్తోంది.

ఆగస్టు 15 నాటికి కేరళ రాష్ట్ర వ్యాప్తంగా పడాల్సిన వర్షపాతం కన్నా మూడు రెట్లు వర్షపాతం ఎక్కువగా ఉంది. మొత్తం రాష్ట్రంలో కురిసిన వర్షపాతం ఎంతో ఇదుక్కి, వేయనాడ్‌ జిల్లాల్లో అంత వర్షపాతం కురిసింది. కేరళను ఆనుకొని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడులోని ఈరోడు, నమ్మక్కల్‌ ప్రాంతాల్లో, కర్ణాటక కొడగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి భారీగా వరదలు వచ్చాయి. కేరళలో సాధారణ వర్షపాతం కన్నా 30 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది.

సహజ సిద్ధమైన కొండలు, లోయలు ఎక్కువగా ఉండే కేరళలో ఇంత ఎక్కువ వర్షపాతం కురిసినంత మాత్రాన ఇంతటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాల్సిన అవసరం లేదు. అయిన జరిగిందంటే మానవ తప్పిదమే. పాలకులు విధాన నిర్ణాయక లోపమే. 11 రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన కోచి విమానాశ్రయం ఎక్కడుందంటే ఇప్పటికే ఎంతో బక్క చిక్కిన పెరియార్‌ నదికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రమ్మంటే రావా? ఇక భారీ వర్షాలు కురిసిన ఈరోడు, నమ్మక్కాల్‌ ప్రాంతాలను తీసుకుంటే కావేరి నది ఒడ్డున కార్మికులు నిర్మించిన ఇళ్లన్ని కొట్టుకుపోయి ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. కావేరి నదికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వరిపొలాలకు నీరందక రైతులు ఆందోళన చెందుతుంటే కావేరీకి వరదలొచ్చి ప్రాణ నష్టం సంభవించిందటే ఎవరి తప్పు? ఇవి ఉదాహరణలు మాత్రమే.

కేరళలో కొండ చెరియలు విరిగి పడి ప్రాణ నష్టం సంభవించడానికి క్వారీలు కారణం. ఇటు క్వారీలు, అటు నదీ ప్రవాహాల పక్కన జనావాసాలు, మానవ నిర్మాణాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది.

మరిన్ని వార్తలు