ఆర్బీఐ డీఫాల్టర్లను ఎందుకు వెల్లడించడం లేదు?

14 Nov, 2018 14:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన బడా బాబుల పేర్లును వెల్లడించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఎన్నిసార్లు ఆదేశించినా, ఈ విషయంలోనే సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించినప్పటికీ భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ పదే పదే ఒకే మాట చెబుతూ వస్తోంది. దేశం, బ్యాంకుల ఆర్థిక ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని ఆ సమాచారాన్ని వెల్లడించలేక పోతున్నామంటూ పాడిందే పాటగా పాడుతూ వస్తోంది. 2015 నుంచి ఆర్బీఐ తంతూ ఇదే. చివరకు విసిగిపోయిన కేంద్ర సమాచార కమిషన్‌ ఇదే విషయమై ఆర్బీఐకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

ఈ నోటీసుకు స్పందించిన ఆర్బీఐ సమాధానం ఇవ్వడానికి నవంబర్‌ 26వ తేదీ వరకు గడువు కావాలని సీఐసీని కోరింది. గడువు కావడానికి కారణం ఏమిటో సులభంగానే ఊహించవచ్చు. చీఫ్‌ సమాచార కమిషనర్‌ సతీష్‌ ఆచార్యులు నవంబర్‌ 20వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఉద్దేశ పూర్వకంగానే ఎగ్గొడుతున్న డీఫాల్టర్ల పేర్లను వెల్లడించాల్సిందిగా సతీష్‌ ఆచార్యులు పట్టుబడుతుండడంతో ఆయన పోయే వరకు నిరీక్షిద్దామనే వైఖరితో ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ వ్యవహిరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ స్థానంలో వచ్చే కొత్తవారిని ఏదో విధంగా మేనేజ్‌ చేసుకోవచ్చన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.

కొన్ని బడా బ్యాంకులు ఇప్పటికే తమ వెబ్‌సైట్లలో డీ ఫాల్టర్లయిన బడా బాబుల పేర్లను వెల్లడించాయని ఆదివారం నాడు ఎన్డీటీవీ ఓ కథనాన్ని ప్రచురించింది. సమాచార హక్కు కింద ఆర్బీఐని సీఐసీ కోరుతున్న సమాచారం ఇప్పటికే బ్యాంకుల వెబ్‌సైట్లలో ఉన్నాయని ఆ వార్తా కథనం పేర్కొంది. ఈ సమాచారం బయటకు రావడంతో ఆర్బీఐ చెబుతున్నట్లుగా లేదా భయపడుతున్నట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థగానీ, బ్యాంకుల ఆర్థిక పరిస్థితిగానీ దెబ్బ తినే సూచనలుగానీ, అల్లకల్లోలం అలికిడిగానీ కనిపించడం లేదే! డీఫాల్టర్ల సమాచారాన్ని వెల్లడించాల్సిన విధి ఆర్బీఐదని 2015లోనే సుప్రీం కోర్టు స్పష్టంగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆర్బీఐలో చలనం లేదు.

‘స్వచ్ఛమైన, పారదర్శకమైన పద్ధతిలో చాలా ఆర్థిక సంస్థలు తమ లావా దేవీలను నిర్వహించడం లేదన్నది మాకు బలమైన అనుమానం. వాటితో సంఘటితమైన ఆర్బీఐ, వాటి లావాదేవీలను ప్రజల దష్టికి రాకుండా కప్పి పుచ్చుతోంది. అది భావ్యం కాదు. అగౌర వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవడం ఆర్బీఐ విధి’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మాటలను పెడ చెవిన పెడితే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌ కింద జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఇటీవల ఆర్బీఐని తీవ్రంగా హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం బడా డీఫాల్టర్ల పేర్లను వెల్లడించాల్సిందిగా ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు ఆర్బీఐని ఆదేశించలేదు? ఆ బడా డీఫాల్టర్లే ఎన్నికల సమయంలో అధికార పార్టీకి భారీగా విరాళాలు ఇస్తున్న వారే అవడం వల్లనా?!

మరిన్ని వార్తలు