ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రమాదకరం!

24 Dec, 2015 17:30 IST|Sakshi
ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రమాదకరం!

ఫేస్‌బుక్ సంస్థ.. ఫ్రీ బేసిక్స్ పేరున ప్రజలను మోసగిస్తోందా? నెట్ న్యూట్రాలిటీకి తూట్లు పొడుస్తూ యూజర్లని మభ్యపెడుతోందా? గతంలో ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ వివాదాస్పదం అవ్వడంతో.. మరింత ఆకట్టుకునేందుకు ఫ్రీ బేసిక్స్ డాట్ కామ్ తో మళ్ళీ ముందుకొచ్చిందా? ఈ కొత్త ప్లాన్ వెనుక ఫేస్ బుక్  పెద్ద ఎత్తుగడే ఉందంటున్నారు నిపుణులు. జనానికి ఉచితి సర్వీసులు అందిస్తున్నట్లు చేసి... స్వలాభం కోసం ప్రయత్నిస్తోందని... ఫేస్ బుక్ అందిస్తున్న ఫ్రీ బేసిక్స్ ఎప్పటికైనా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.


నెట్ న్యూట్రాలిటీ అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్నెట్‌ను అందరికీ సమానంగా అందుబాటులో ఉంచడం  ‘నెట్ న్యూట్రాలిటీ' ప్రధాన లక్ష్యం. ఇంటర్నెట్ లో అన్ని వెబ్ సైట్లనూ వినియోగదారులంతా ఒకే రీతిలో వాడుకునేందుకు వీలుగా.. యూజర్లంతా స్పందించాలని 'సేవ్ ద ఇంటర్నెట్' పేరున ఇప్పటికే ఆన్ లైన్ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఫేస్ బుక్ మార్కెటింగ్ మాయాజాలాన్ని ఎదుర్కొనేందుకు వినియోగదారులు ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతూ ట్రాయ్‌కు సైతం ఫిర్యాదులు చేశారు. అయితే కొందరు టెలికాం అపరేటర్లు ప్యాకేజీల పేరున వినియోగదార్లను ఆకట్టుకొని.. ఇంటర్నెట్ వినియోగం నియంత్రించే ప్రయత్నాలు చేయడంతోనే అసలు గొడవ మొదలైంది. ఇదే తరహాలో వచ్చిన ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ సరైన పద్ధతి కాదని, ఇతర దేశాలు ప్రోత్సహిస్తున్న ఈ మార్కెటింగ్ పద్ధతిని తిప్పికొట్టాలని యూజర్లు సంఘంగా ఏర్పడ్డారు. ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు.

ఫ్రీ బేసిక్స్ ద్వారా ఇంటర్నెట్ వాడకం మన చేతుల్లోనుంచి టెలికమ్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళబోతోంది అన్నది నిపుణుల ఉవాచ. ప్రజలకు ఫ్రీ ఇంటర్నెట్ అందించేందుకు ఇంకా ఎన్నో ఇతర పద్ధతులు ఉన్నాయని, ఫేస్ బుక్ పోటీతత్వంతో స్వప్రయోజనాలను ప్రజలపై రుద్దే ప్రయత్నంలో భాగంగా ఫ్రీ బేసిక్స్‌ను తెస్తోందని చెప్తున్నారు. ఫ్రీ బేసిక్స్‌కు ఏమాత్రం మద్దతివ్వద్దంటున్నారు. నిజానికి ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ కోసం టెలికాం ఆపరేటర్లకు ఎలాంటి బిల్లూ చెల్లించదు. ఇది టెలికాం ఆపరేటర్లే చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా ఇంటర్నెట్ డేటా ఖర్చును తగ్గించుకుని ఫేస్ బుక్ తన పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు. అంతేకాదు ఫ్రీ బేసిక్స్ తన భాగస్వాములకు మాత్రమే ఉచిత సౌకర్యాన్ని అందిస్తుంది. మిగిలినవారంతా ఇంటర్నెట్ కోసం ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా  నెట్ న్యూట్రాలిటీని ఉల్లంఘించడమే అవుతుంది.    


భారత దేశంలో రోజురోజుకీ ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2015 సంవత్సరంలో ఫ్రీ బేసిక్స్ అందుబాటులో లేని సమయంలో దేశంలో వంద మిలియన్ల వినియోగదారులు కొత్తగా చేరారు. ఇప్పుడు ఫ్రీ బేసిక్స్ బహిరంగ వేదిక కాకపోగా.. ప్రత్యేకంగా తమకు కొన్ని మార్గదర్శకాలను కూడ నిర్వచించుకోవడం విశేషం.  అందుకు అనుగుణంగానే వినియోగదారులు కూడ నడచుకోవాల్సి వస్తుంది. ఇది ప్రజలను మభ్యపెట్టడమూ, తప్పుదారి పట్టించడమేనని కొన్ని టెలికాం సంస్థలు సైతం చెప్తున్నాయి.  ఫ్రీ బేసిక్స్ పేరున ఫేస్ బుక్ అన్ని సైట్లలో ఉచితంగా చొరబడగలగడమే కాక, ఎన్.ఎస్.ఏ కు  డేటా అందించడం కూడ భారత దేశ భ్రతకే ముప్పు అంటున్నారు నిపుణులు.

నిజానికి  ఫ్రీ బేసిక్స్ ప్రకటనలకూ అతీతమేం కాదు. తమ సైట్లో ప్రకటనలు ఉండవు అని చెప్పడం లేదు. 3.2 మిలియన్ల ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని చెప్పడంలోనే నిజం కనిపించడం లేదు. వారికి వచ్చిన ఈ మెయిల్స్ లో న్యాయబద్ధమైనవి ఎన్ని ఉంటాయనేది అనుమానమే అంటున్నారు ఆన్ లైన్ ఉద్యమకారులు. ఫ్రీ బేసిక్స్ ను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించవద్దని గట్టిగా చెప్తున్నారు.  ఏది ఏమైనా ప్రస్తుతం నెట్ న్యూట్రాలటీ అంశం పై చెలరేగిన వివాదాన్ని క్రేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీన్ని అధ్యయనం చేసేందుకు పలువురు నిపుణుల కమిటీని కూడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు