భర్త అంత్యక్రియల కోసం పిల్లల్ని తాకట్టు పెట్టింది

18 Feb, 2016 16:12 IST|Sakshi
భర్త అంత్యక్రియల కోసం పిల్లల్ని తాకట్టు పెట్టింది

చంపువా: పేదరికం ముందు తల్లిప్రేమ చిన్నబోయింది. కుటుంబానికి అండగా ఉన్న పెద్ద దిక్కు అనుకోకుండా మృతి చెందడంతో అతని అంత్యక్రియలకు అయిన అప్పులు చెల్లించడానికి వేరే దారి లేక తన ఇద్దరు పిల్లలను ఓ తల్లి తాకట్టుపెట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒడీషాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. చంపువా ప్రాంతంలోని గందూలి గ్రామానికి చెందిన రోజు కూలి రైబా.. అనారోగ్యంతో రిపబ్లిక్ డే రోజున మృతి చెందాడు. అప్పటి వరకు కూడబెట్టిన కొద్దిపాటి డబ్బు కూడా రైబా ఆసుపత్రి ఖర్చులకే కరిగిపోవడంతో భార్య సావిత్రికి అతని అంత్యక్రియలను నిర్వహించడానికి చేతిలో చిల్లిగవ్వ మిగలలేదు. తెలిసిన వారిని సహాయం కోసం అర్ధించినా అందరూ మొహం చాటేశారు. దీంతో తన ఇద్దరు పిల్లలు ముఖేశ్(13), సుఖేష్(11) లను పొరుగువారి వద్ద రూ. 5000 లకు తాకట్టుపెట్టిన సావిత్రి భర్త అంత్య క్రియలు నిర్వహించింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రాంతీయ అభివృద్ధి అధికారి ఎస్ నాయక్ బుధవారం ఆ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఇద్దరు పిల్లలను తాకట్టు నుండి విడిపించారు. వారికి విద్యా సౌకర్యాలను అందించనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. కాగా సావిత్రికి మరో ముగ్గురు పిల్లలు ఆకాశ్(9), చిల్లరి(8), బర్షా(4) ఉన్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు