మానవత్వానికి మరో మచ్చ

28 Aug, 2016 09:33 IST|Sakshi
మానవత్వానికి మరో మచ్చ

భోపాల్: మొన్న ఒడిశా.. నేడు మధ్యప్రదేశ్.. ప్రాంతం ఏదైతేనేం.. రూపానికే మనుషులు బతికుంటున్నారు.. మానవత్వాన్ని చంపేస్తున్నారని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య మార్గం మధ్యలోనే చనిపోవడంతో చంటిబిడ్డ, ఓ పెద్దావిడ ఉందనే జాలి కూడా లేకుండా వారి కుటుంబాన్ని అర్థాంతరంగా బస్సులో నుంచి దింపేశారు. అటవీ ప్రాంతంలో జోరు వర్షం పడుతుండగా వారిపై ఏమాత్రం కనికరం లేకుండా మధ్యలోనే బస్సులో నుంచి వెళ్లగొట్టారు.

దీంతో చిన్నబోయిన ముఖంతో కంటి నిండా నీరుతో రెండు చేతులపై చంటి బిడ్డను వేసుకొని రోడ్డుపక్కన భార్య మృతదేహాన్ని ఉంచి తన ముసలితల్లితో కలిసి వచ్చిపోయే వాహనాల వైపు అతడు దీనంగా చూడటం మొదలుపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దామో జిల్లాలో రామ్ సింగ్ లోధి అనే వ్యక్తి అనారోగ్యానికి గురైన తన భార్య మల్లి బాయి, తన ఐదురోజులపాప, తల్లి సునియా బాయ్ తో కలిసి ఆస్పత్రికి ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరారు.

అయితే, మార్గం మధ్యలో ఉండగానే సింగ్ భార్య సునియా చనిపోయింది. దీంతో బస్సు కండక్టర్ వారిని అర్ధాంతరంగా దింపేశాడు. అలా అరగంటపాటు వర్షంలోనే దామోకు 20 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో రోడ్డుపక్కన కూర్చున్నారు. అదే సమయంలో మృత్యుంజయ్ హజారీ, రాజేశ్ పాటిల్ అనే ఇద్దరు న్యాయవాదులు ఆ రోడ్డు గుండా పోతూ వారికి సహాయం చేశారు. పోలీసులకు ఫోన్ చేయగా వారు కేవలం వివరాలు మాత్రమే నమోదుచేసుకొని వెళ్లిపోగా లాయర్లు మాత్రం వారికి ఒక ట్యాక్సీ ఏర్పాటుచేశారు. అనంతరం ఈ విషయం బయటకు రావడంతో ప్రైవేటు బస్సును సీజ్ చేసి.. డ్రైవర్, కండక్టర్ ను అరెస్టు చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు