కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

12 Jul, 2019 06:53 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: టిక్‌టాక్‌ ఓ నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త కంటే టిక్‌టాక్‌ ముఖ్యమని భావించిన ఆ ఇల్లాలు ఏకంగా విడాకుల నోటీసులు పంపిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కీచులాటలో నలిగిపోతున్న 6 ఏళ్ల బాలుడు వివాదం బాలల సంక్షేమశాఖకు చేరింది. వివరాలు..తిరుచ్చిరాపల్లికి చెందిన మహేష్‌ (37) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, తిరునెల్వేలికి చెందిన దివ్య (32)ల ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారడంతో 2008లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2013లో మగబిడ్డ పుట్టాడు. సెల్‌ఫోన్‌లోని టిక్‌టాక్, మ్యూజికల్లీ వంటి యాప్‌లపై దివ్య విపరీతమైన మోజుపెంచుకోవడంతో దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. 2017లో ఆమె కుమారుడిని తీసుకుని తిరునెల్వేలిలోని పుట్టింటికి వెళ్లిపోయింది.

అక్కడి పాఠశాలలో కుమారుడిని చేర్చి తానూ ఉద్యోగంలో చేరింది. భర్తకు విడాకుల నోటీసు పంపింది. దివ్యతో కలిసి జీవించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ తిరుచ్చిరాపల్లి న్యాయస్థానంలో భర్త మహేష్‌ పిటిషన్‌ వేశాడు. ఇదిలా ఉండగా, కుమారుడి ఒంటినిండా గాయాలున్నట్లు గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ విషయాన్ని మహేష్, దివ్యలకు తెలియజేశాడు. దివ్యకు అన్సారీ అనే యువకుడితో సంబంధం ఉంది. అతనితో కలిసి బాబును చిత్రహింసలకు గురిచేస్తోందని బాలల సంక్షేమశాఖకు ఫిర్యాదు చేశాడు. దివ్యతో విడిపోయిన తరువాత మహేష్‌ మరో వివాహం చేసుకున్నాడని, మహేష్‌ ఎవరో కూడా బాబుకు తెలియదని విచారణ చేపట్టిన సంబంధిత అధికారి చంద్రకుమార్‌ చెప్పాడు. కుమారుడు అనారోగ్యంతో ఉన్నందున తల్లికే అప్పగిస్తున్నామని తెలిపాడు. అన్సారీ విదేశాలకు వెళ్లి ఉన్నాడు, పదిరోజుల తరువాత ఈ వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన మీడియాకు తెలియజేశాడు.

మరిన్ని వార్తలు