అమర వీరుడికి భార్య అరుదైన నివాళి

20 Feb, 2019 12:47 IST|Sakshi

‘నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మేమంతా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. ఎందుకంటే ప్రతిఒక్కరినీ నువ్వు ప్రేమించే పద్ధతి భిన్నంగా ఉంటుంది. కనీసం ఎప్పుడూ నిన్ను కలవని వారి కోసం ప్రాణత్యాగం చేశావంటే నువ్వు ఎంత గొప్ప ధైర్యశాలివి? నిన్ను భర్తగా పొందడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితం నీకే అంకితం. నిజమే.. నువ్వు మాకు దూరం​ కావడం బాధగానే ఉంది. కానీ నువ్వెప్పుడూ మా చుట్టూనే ఉంటావు. ఆయన మరణంపై సానుభూతి చూపించొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనమంతా ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. మనల్ని మరింత దృఢంగా ఉంచేందుకే ఆయన ప్రాణాలు ఫణంగా పెట్టారు. ఆయనకు సెల్యూట్‌ చేయండి. జైహింద్‌’... ఆర్మీ మేజర్‌ విబూది శంకర్‌ ధొండ్యాల్‌ భార్య నితిక కౌల్‌ ఉద్వేగంగా అన్న మాటలివి.

దేశం కోసం అమరుడైన భర్తకు ఆమె అరుదైన నివాళి అర్పించారు. తన భర్త నిజమైన హీరో అంటూ కొనియాడారు. కొండంత బాధను గుండెల్లో దాచుకుని భర్తకు చివరిసారిగా ముద్దిచ్చి ‘ఐ లవ్‌ యూ’ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు జాతియావత్తును కదిలించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా తిరుగుతోంది. సోమవారం కశ్మీర్‌లోని పింగ్లాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో విబూది ధొండ్యాల్‌ వీర మరణం చెందారు. ఆయన భౌతిక కాయానికి హరిద్వార్‌లోని గంగా నది తీరంలో మంగళవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. (ఎన్‌కౌంటర్‌లో కమ్రాన్‌ హతం)

డెహ్రడూన్‌కు చెందిన విబూది ధొండ్యాల్‌తో నితికకు 10 నెలల క్రితమే పెళ్లైంది. మొదటి పెళ్లిరోజును భర్తతో కలిసి సంతోషంగా జరుపుకోవాలన్న నితికకు పుల్వామా ఉగ్రదాడి రూపంలో ఊహించని ప్రమాదం ఎదురైంది. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులైన ముష్కరులకు మట్టుబెట్టే క్రమంలో నికిత భర్త నేలకొరిగారు. తీవ్రవాదం పెచ్చరిల్లడంతో 90వ దశకంలో నితిక తల్లిదండ్రులు కశ్మీర్‌ను వదిలి వచ్చేశారు. ఏదైతే జరగకూడదని భావించారో చివరకు అదే జరిగింది. ముష్కర మూకలు నితిక భర్త ప్రాణాలను బలితీసుకున్నాయి. అయితే క్లిష్టసమయంలో ఆమె చూపిన గుండెనిబ్బరం, పోరాట స్ఫూర్తికి ప్రజలు సలాం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు