ఐదేళ్లూ నేనే సీఎం

3 May, 2016 21:40 IST|Sakshi
ఐదేళ్లూ నేనే సీఎం

 = నాయకత్వ మార్పు ప్రశ్నే లేదు
 = అదంతా మీడియా సృష్టి, గాలి వార్తలు
 =  త్వరలో మంత్రివర్గ విస్తరణ
 =  సీఎం సిద్దరామయ్య

 
సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని, ఇందులో ఎలాంటి అనుమానం వద్దని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన బళ్లారి జిల్లాలో కరువు ప్రాంతాలు పరిశీలన, బళ్లారి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలో కరువు నివారణ గురించి ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశం అయిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పు జరుగుతుందనే ప్రచారం జరుగుతోందని విలేకరులు సీఎం దృష్టికి తీసుకుని రాగా ఆయనపై విధంగా ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పాటు పూర్తి అధికార అవధి తానే నిర్వర్తిస్తానన్నారు. తనను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించి మరొకరిని నియమించడం జరగదన్నారు. అదంతా మీడియా సృష్టి, గాలి వార్తలేనని కొట్టి పారేశారు.
 
 ముఖ్యమంత్రిని మార్పు చేయాలనే ఉద్దేశం హైకమాండ్‌కు కూడా లేదన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరువు, మంచినీటి సమస్య తీర్చేందుకు వివిధ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నానని, ఇదంతా ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌తో చర్చించి మంత్రివర్గ విస్తరణ చేపడతామని చెప్పారు.

బళ్లారి జిల్లాలో ఇసుక బంగారంలా మారిందని, కాంట్రాక్టర్లు, అధికారులు దోచుకుంటూ సామాన్య, మధ్యతరగతి వర్గాల వారికి ఇళ్లు కట్టుకునేందుకు కూడా ఇసుక దొరకడం లేదని సీఎం దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా, ఆయన స్పందిస్తూ ఇసుకను అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, మంత్రులు హెచ్‌కే.పాటిల్, ఖమరుల్ ఇస్లాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు