అతి పెద్ద కుట్రను బయటపెడతా: సీఎం

28 Sep, 2016 10:25 IST|Sakshi
అతి పెద్ద కుట్రను బయటపెడతా: సీఎం

తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు తనపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని, దీని వెనక ఉన్న అతిపెద్ద కుట్రను అసెంబ్లీ సాక్షిగా శుక్రవారం బయట పెడతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఇందుకోసం శుక్రవారం నాడు అసెంబ్లీని ప్రత్యేకంగా ఒకరోజు సమావేశపరుస్తున్నారు. తద్వారా.. కేంద్రంతో మరో పోరాటానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేజ్రీవాల్ మీద, మంత్రుల మీద, ఆప్ ఎమ్మెల్యేల మీద తప్పుడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడంపై అసెంబ్లీని ఒకరోజు ప్రత్యేకంగా సమావేశపచరాలని ఢిల్లీ మంత్రివర్గం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా చెప్పారు.

తమ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, తన కార్యాలయంపై సీబీఐ దాడులు చేయించారని.. ఇదంతా చాలా పెద్ద కుట్రలో భాగమని, దాన్ని శుక్రవారం నాడు ఢిల్లీ అసెంబ్లీలో బయటపెడతానని కేజ్రీవాల్ ట్వీట్ కూడా చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లో అక్రమ నియామకాలపై ఏసీబీ మొదలుపెట్టిన విచారణలో భాగంగా ముఖ్యమంత్రి పేరును కూడా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయడంతో ఢిల్లీ సర్కారు అగ్గిమీద గుగ్గిలం అయింది. కేజ్రీవాల్‌ను తాము ప్రశ్నించబోమని ఏసీబీ చెప్పినా ఆగ్రహం మాత్రం తగ్గలేదు. ఇక తాను సత్యేంద్ర జైన్‌ను పిలిపించి పత్రాలన్నీ చూశానని, ఆయన నిర్దోషి అని కూడా అరవింద్ కేజ్రీవాల్ మరో ట్వీట్‌లో చెప్పారు. ఆయన తప్పు చేసి ఉంటే ఎప్పుడో బయటకు పంపేసేవాళ్లమని, ఇప్పుడు మాత్రం ఆయనకు అండగా ఉంటామని అన్నారు.

ఎఫ్ఐఆర్ పెట్టడానికి ప్రధానమంత్రి అంగీకరించిన విషయం స్పష్టంగా తెలుస్తోందని, దీనివెనక ఉన్న కుట్రను తాము బయటపెడతామని కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో డెంగ్యూ, చికన్ గున్యాల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వైఫల్యంపై కూడా ఆప్ ఎమ్మెల్యేలు గట్టిగా తమ వాణిని వినిపించనున్నారు. ఢిల్లీ మునిసిపాలిటీలు మూడూ బీజేపీ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే డెంగ్యూ, చికన్ గున్యా ప్రబలిన సమయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి.. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ ఢిల్లీలో లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దాన్ని ఖండించడానికి ఆ బాధ్యత మొత్తం మునిసిపాలిటీదేనని ఆప్ మొదటినుంచి చెబుతున్న విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు