టీటీడీపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ : స్వామి

9 Jul, 2018 12:27 IST|Sakshi
సుబ్రహ్మణ్యస్వామి (పాత చిత్రం)

న్యూఢిల్లీ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో గత కొంతకాలం నుండి వివాదాలు కొనసాగుతున్నాయి. ఓవైపు ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో టీటీడీ వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 19న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీని తొలగించాలన్నదే బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ సారాంశమని సమాచారం. ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేయాలని డిమాండ్‌, దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేదంటే లూటీ ఇలాగే కొనసాగుతుందని గతంలో స్వామి వ్యాఖ్యానించారు.

బోర్డులో జరుగుతున్న వివాదంపై టీటీడీ సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపగా, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డులో పొరుగు రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రి భార్యకు చోటు కల్పించడం, టీడీపీ ఎమ్మెల్యే అనితకు సైతం బోర్డు మెంబర్‌గా నియమించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనిత చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఏపీ ప్రభుత్వం ఆమె విషయంలో వెనక్కి తగ్గింది.

మరిన్ని వార్తలు