గంగా నది ప్రక్షాళన ఇంకెప్పుడు?

4 Sep, 2014 02:30 IST|Sakshi
గంగా నది ప్రక్షాళన ఇంకెప్పుడు?

ముందు తరాల వారికైనా ఆ భాగ్యం కలిగించండి
- మరో 200 ఏళ్లయినా పరిస్థితి మారదేమో!
న్యూఢిల్లీ: గంగా నది ప్రక్షాళనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని బట్టి ఇంకో రెండు శతాబ్దాలు గడిచినా పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కోర్టు ఈ విధంగా స్పందించింది. నదికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తీసుకునే చర్యలను దశలవారీగా వివరిస్తూ మూడు వారాల్లో సమగ్ర ప్రణాళికను కోర్టు ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘ఇదో కలల ప్రాజెక్టు.

కనీసం ముందు తరాల వారైనా గంగా నదిని అసలైన రూపంలో చూడగలిగేలా దయచేసి ప్రయత్నించండి. మనం అలా చూస్తామో లేదో తెలియదు’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్. భానుమతితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూస పద్ధతిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చడం వల్ల ప్రయోజనం ఉండదని, ఈ విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో రావాలని కేంద్రానికి నిర్దేశించింది. 2500 కిలోమీటర్ల పొడవైన గంగా నది ప్రక్షాళనకు విదేశాల నుంచి వస్తున్న నిధుల విషయంపై ఎలాంటి ఆందోళన లేదని, ఈ ప్రాజెక్టు అమలును సామాన్య ప్రజలకు ఎలా వివరిస్తారన్నదే కీలకమని కోర్టు పేర్కొంది.

గంగా ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందో ప్రజలకు తెలి యాల్సిన అవసరముందని, కేంద్రం ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్‌లో సమగ్ర వివరాలను పొందుపరచలేదని, ప్రాజెక్టు అమలుపై దశలవారీగా ప్రణాళికలు తెలుపుతూ అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌ను ఆదేశించింది. గంగా నదిలోకి కాలుష్యాలను వదులుతూ చట్టాన్ని ఉల్లంఘించే పారిశ్రమల విషయంలో చర్యలు తీసుకునేందుకు న్యాయపరంగా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
 
జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టాం
గంగా ప్రక్షాళన కార్యక్రమాన్ని జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టామని కేంద్రం ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్‌లో కోర్టుకు తెలిపింది. లక్ష్యాలను పూర్తి చేసేందుకు వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల బృందంతో అధ్యయనం చేయించామని, ప్రస్తుతం ఈ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొంది.ఏడు ఐఐటీల కనార్షియం నివేదిక కూడా డిసెంబర్ కల్లా వచ్చే అవకాశముందని వివరించింది.

మరిన్ని వార్తలు