అత్యాచార బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు ?

20 Apr, 2018 10:08 IST|Sakshi

పెండింగ్‌లో లక్షకు పైగా కేసులు 

నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా, అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసినా రోజు రోజుకి ఈ పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అత్యాచార బాధితులకు న్యాయం ఎండమావిగానే మిగిలిపోతోంది. కథువా, ఉన్నావ్‌ అత్యాచార కేసులతో దేశవ్యాప్తంగా మహిళలు దోషులకు కఠిన శిక్షలు విధించాలని, సత్వర న్యాయం జరిగేలా చూడాలని గళమెత్తుతున్నా పట్టించుకునే వారే లేరు. 2012  నిర్భయ ఘటనతో యావత్‌ భారతదేశం చలించిపోయింది. యువతీ యువకులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మరో ఆడపిల్లకి ఇంత దుర్భర స్థితి రాకూడదని, అత్యాచారం కేసుల్లో కఠిన శిక్షలు విధించాలంటూ డిమాండ్‌ చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కిరాతకమైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది.

కేసుల విచారణను కూడా త్వరితగతిని పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చింది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఎన్ని చట్టాలు వచ్చినా తమను ఏం చేయలేవన్న ధీమా రేపిస్టుల్లో పెరిగిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. 2012 నిర్భయ కేసు తర్వాత దేశంలో అత్యాచార కేసులు 60 శాతం పెరిగితే, చిన్నారులపై రేప్‌ కేసులు 40 శాతం పెరిగాయి. అయితే 25శాతం కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2016 చివరి నాటికి లక్షా 33 వేల అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2012 నాటికి లక్ష కేసులు పెండింగ్‌లో ఉంటే అప్పట్నుంచి పెండింగ్‌ కేసుల సంఖ్య ప్రతీ ఏడాది 85 శాతం పెరుగుతూ వస్తోంది. 2012, 16 మధ్య నమోదైన వాటిలో మూడో వంతు కేసులు పోలీసు స్టేషన్‌ పరిధిలోనే నీరు కారిపోతున్నాయి.

ఉన్నావ్‌ వంటి కేసుల్లో ప్రజల నుంచి తీవ్ర నిరసన, ఒత్తిడి రావడం వల్లే కేసు నమోదైంది తప్పితే ఎంత ఘాతుకం జరిగినా పోలీసుల్లో కాస్త కూడా చలనం కనిపించడం లేదు. అత్యాచార కేసులపై రాజకీయ ప్రభావం ఉండడంతో వాటి అతీ గతీ ఎవరికీ పట్టడం లేదు. కేవలం అత్యాచార కేసుల పరిశీలన కోసం దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పోలీసు అధికారుల నియామకానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయినా ఆ పోస్టుల్లో నాలుగో వంతు ఖాళీగానే ఉండడంతో చాలా కేసులు కోర్టు వరకూ కూడా చేరడం లేదు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్‌ కేసుల విచారణకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసుల విచారణ ఇంత నత్తనడకన సాగుతూ ఉంటే ఎన్ని రకాలు చట్టాలు తీసుకువచ్చి ప్రయోజనమేముందనే అభిప్రాయం వ్యక్తం సర్వత్రా  అవుతోంది. 
 

మరిన్ని వార్తలు