పౌరసత్వం ఇచ్చి తీరుతాం..

2 Mar, 2020 03:45 IST|Sakshi

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడి

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దేశంలోని శరణార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చి తీరుతుందని.. అప్పటివరకు వెనకడుగు వేసేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. సీఏఏ శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది మాత్రమేనని.. దీనివల్ల ఏ ఒక్క వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోడని ఉద్ఘాటించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు సీఏఏపై అసత్య ప్రచారాన్ని చేస్తూ.. మైనారిటీలు, శరణార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వం కోసం శరణార్థులు పత్రాలు చూపించాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన ఓ పబ్లిక్‌ ర్యాలీలో పాల్గొన్న అమిత్‌షా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి.. మమత అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులు, వెనుకబడిన మతువా కులాలకు పౌరసత్వం రాకుండా మమత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే పౌరసత్వ చట్ట అమలును ఆపాలని మమతకు సవాల్‌ విసిరారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తుంటే మమత సహా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆర్‌ నోయ్‌ అన్యాయ్‌ (ఇక అన్యాయాన్ని సహించం)’అనే ప్రచారాన్ని అమిత్‌షా ప్రారంభించారు.  

ర్యాలీలో ‘గోలీమారో’నినాదాలు..
షహీద్‌ మినార్‌ గ్రౌండ్‌లో జరిగిన అమిత్‌షా ర్యాలీలో కొందరు బీజేపీ కార్యకర్తలు ‘గోలీమారో’అని నినాదాలు చేశారు. దీనికి సంబంధించి కోల్‌కతా పోలీసులను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

భారత్‌లో మెరుగైన రక్షణ విధానం
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మెరుగైన రక్షణ విధానాన్ని రూపొందించిందని అమిత్‌షా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. 10 వేల ఏళ్ల చరిత్రలో భారత్‌ ఎలాంటి దాడులూ జరపలేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఎవరైనా తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినా.. జవాన్లు, ప్రజల మీద దాడులకు యత్నించినా.. భారత్‌ గట్టిగా బదులిస్తుందని పేర్కొన్నారు. రాజర్‌హాట్‌లో జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) 29వ స్పెషల్‌ కంపోసిట్‌ గ్రూప్‌ (ఎస్‌సీజీ) కాంప్లెక్స్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌జీ అంటే ఉగ్ర వ్యతిరేక దళంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా