సీఏఏపై వెనక్కి వెళ్లం

17 Feb, 2020 04:54 IST|Sakshi
వారణాసిలోని శ్రీ జగద్డురు విశ్వారాధ్య గురుకుల్‌లో ప్రజలతో ప్రధాని మోదీ కరచాలనం

తేల్చి చెప్పిన ప్రధాని మోదీ

వారణాసిలో రూ.1,254 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

వారణాసి: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాలపై ఒత్తిళ్లకు తలొగ్గి పునరాలోచన చేసే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించి తీసుకున్న నిర్ణయాలపై ఎన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చినా కట్టుబడే ఉంటామని స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఆదివారం రోజంతా మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘జమ్ము కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని కోల్పోయే ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏ నిర్ణయాల కోసం దేశ ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు.

ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ జాతి ప్రయోజనాలకు సంబంధించిన ఈ నిర్ణయాలపై మేము చాలా కచ్చితంగా నిలబడి ఉన్నాం. భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటాం’’అని ప్రధాని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ తమ నిర్ణయానికి కట్టుబడే ఉంటామని గట్టిగా చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఇక వేగవంతం అవుతాయని మోదీ చెప్పారు. మందిర నిర్మాణంపై ఏర్పాటైన ట్రస్ట్‌కి 67 ఎకరాల భూమి అప్పగిస్తున్నామని, పనులు ఇక వాయువేగంతో సాగుతాయన్నారు.  

రోజంతా బిజీ బిజీ..
అంతకు ముందు ప్రధాని తన సొంత నియోజకవర్గంలో రూ.1,254 కోట్లు విలువ చేసే 50 ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మెమోరియల్‌ సెంటర్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా 63 అడుగుల ఎల్తైన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. దళితులు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పండిట్‌ దీన్‌ దయాళ్‌ అంత్యోదయ పథకం తెచ్చారని, ఆయన బాటలో నడుస్తూ చివరి లబ్ధిదారుడికి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నామని మోదీ చెప్పారు. వారణాసిలో అయిదేళ్లలో రూ.25 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగు తున్నాయని తెలిపారు. ప్రధాని వారణాసిలో శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్‌ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. 430 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని, కాశీ ఏక్‌ రూప్‌ అనేక్‌ పేరుతో ఏర్పాటైన హస్తకళల ప్రదర్శనను మోదీ ప్రారంభించారు.

మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం
ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్లడానికి వీలు కల్పించే ఐఆర్‌సీటీసీకి చెందిన ప్రైవేటు రైలు మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో శివుడికి ప్రత్యేకంగా ఓ సీటు రిజర్వ్‌ చేశారు. ఎవరూ కూర్చోకుండా అది శివుడిదని తెలిసేలా బీ5 కోచ్‌లోని 64వ సీటును శివుడికి కేటాయించినట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్‌ కుమార్‌ తెలిపారు. ఈ సీటు కేవలం ఒక్కసారికేనా లేక శాశ్వతంగా ఉంటుందా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు