పాక్‌ ప్రయాణంపై గావస్కర్‌ క్లారిటీ

6 Aug, 2018 09:01 IST|Sakshi
సునీల్‌ గవాస్కర్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావాస్కర్‌ స్పష్టం చేశారు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆగస్టు 11 న ఉంటుందని తొలుత వెల్లడించారు. కానీ, పాకిస్తాన్‌ నూతన ప్రధాని ఆగస్టు 14న ప్రమాణ స్వీకారం చేయాలన్నది ఆపద్ధర్మ ప్రధాని నసీరుల్‌ ముల్క్‌ ఉద్దేశమని తాత్కాలిక న్యాయమంత్రి అలీజాఫర్‌ చెప్పారు. జాతీయ అసెంబ్లీ ఆగస్టు 12న ప్రారంభవుతుందనీ, ఇమ్రాన్‌ ప్రధానిగా 14న ప్రమాణం చేస్తారని మం‍త్రి ప్రకటించారు.  ఆగస్టు 14 పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం కావడం గమనార్హం.

కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ ఆఫీసు నుంచి ఆహ్వానం అందిందనీ తెలిపిన గావస్కర్‌.. ఏదేనీ కారణాల వల్ల కార్యక్రమం ఆగస్టు 15కు వాయిదా పడితే మాత్రం తాను హాజరు కానని చెప్పారు. అదే రోజు తన తల్లి పుట్టిన రోజు, భారత స్వాతంత్ర్య దినం కావడం.. మరోవైపు టెస్టు మ్యాచుల్లో కామెంటరీ కోసం ఇంగ్లండ్‌ వెళ్లాల్సి ఉండడంతో పాక్‌కు వెళ్లనని తెలిపారు. 1992లో ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలో పాకిస్తాన్‌ జట్టు వన్డే ప్రపంచకప్‌ గెలిపొందిన విషయం అందరికీ తెలిసిందే. టోర్నీ అనంతరం పాకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ కప్‌ విజయోత్సవ వేడుకల్లో గావస్కర్‌ కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు