మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటాం: షిండే

12 Mar, 2014 12:29 IST|Sakshi
మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటాం: షిండే

భద్రతాదళాలపై దాడిచేసి వారి ప్రాణాలను బలిగొన్న మావోయిస్టులను ఊరికే వదిలేది లేదని.. ఇంతకింత ప్రతీకారం తప్పనిసరిగా తీర్చుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే హెచ్చరించారు. మావోయిస్టుల దాడిలో మరణించిన జవాన్ల మృతదేహాలకు షిండే నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేందుకు మావోయిస్టులు ప్రయత్నించి, విఫలమయ్యారని, తమ ప్రాధాన్యం తగ్గిపోతోందని భయపడే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు. మంగళవారం నాడు బలగాలు ఎన్నికలు సజావుగా సాగేందుకు మార్గం తనిఖీ చేయడానికే వెళ్లాయన్నారు.

ఇలాంటి దాడులతో ఎన్నికలను వాయిదా వేసేది లేదని, లోక్సభ ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే యథాతథంగా జరుగుతాయని అన్నారు. మావోయిస్టులను అణిచేసేందుకు రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి  సంయుక్త ఆపరేషన్ చేస్తయాని షిండే వెల్లడించారు. ఇక మంగళవారం నాటి కేసును దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏకు అప్పగిస్తామన్నారు. భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయేమో సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. ఇక మరో కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కూడా మావోయిస్టుల దాడిని ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీనిపై పోరాడాలని అన్నారు.

మరిన్ని వార్తలు