ఇక తమిళ సినిమాలు చూస్తా: రాహుల్

5 Jun, 2017 09:59 IST|Sakshi
ఇక తమిళ సినిమాలు చూస్తా: రాహుల్

తమిళనాడు ప్రజలన్నా, వాళ్ల భాష, సంస్కృతి అంటే తనకు ఎంతో ఇష్టమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ఇకమీదట తాను తమిళ సినిమాలు చూస్తానని, తమిళ ప్రజల సంస్కృతి గురించి తెలుసుకోడానికి పుస్తకాలు చదువుతానని కూడా చెప్పారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశం సందర్భంగా ఆయనీ విషయాలు తెలిపారు. తాను తన సోదరి ప్రియాంకకు ఒక ఎస్ఎంఎస్ చేశానని, తమిళనాడు వెళ్లడమంటే తనకెంతో ఇష్టమని అందులో చెప్పానని అన్నారు. ఎందుకో తెలియదు గానీ, తమిళ ప్రజలతో తనకు చాలా అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. తమిళం అన్నా, తమిళులన్నా తనకెంతో ప్రేమ ఉందని చెప్పినప్పుడు ప్రియాంక కూడా తనదీ అదే ఫీలింగ్ అని చెప్పారన్నారు. ఈ సమావేశంలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తిరునావక్కరసర్, సీఎల్పీ నేత కేఆర్ రామస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.

ఉపనిషత్తులు చదువుకుంటున్నా
చదువుకోడానికి వయసుతో పనిలేదంటారు. అందుకే.. రాహుల్ గాంధీ ఇప్పుడు మళ్లీ పుస్తకాలు తీశారు. అయితే ఇవి క్లాసు పుస్తకాలు కాదట, ఉపనిషత్తులు, భగవద్గీత అని స్వయానా ఆయనే చెబుతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి వీటిని ఎందుకు చదువుతున్నారంటే... ఆర్ఎస్ఎస్, బీజేపీల మీద ఎదురుదాడి చేయడానికట!! ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీయే వెల్లడించారు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భంగా ఆయనీ విషయం తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలతో తలపడేందుకు తాను ఈ మధ్య ఉపనిషత్తులు, భగవద్గీత చదువుతున్నానని అన్నారు. ఉపనిషత్తులలో ప్రజలంతా సమానమేనని చెబుతున్నా వాళ్లు మాత్రం కొంతమందిని అణగదొక్కుతున్నారని, తద్వారా మీ సొంత మతం చెప్పేదానికి భన్నంగా ప్రవర్తిస్తున్నారని తాను ఆర్ఎస్ఎస్ వాళ్లను అడుగుతానన్నారు. అసలు బీజేపీవాళ్లకు భారతదేశం అంటే అర్థం కావట్లేదని, వాళ్లకు కేవలం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న 'నాగ్‌పూర్' మాత్రమే అర్థమవుతుందంటూ చురకలు వేశారు. ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా కేవలం ప్రధాని మోదీ నుంచే వచ్చిందని వాళ్లు అపోహ పడుతున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు