అభినందన్‌ వర్ధమాన్‌కు వీరచక్ర

15 Aug, 2019 03:04 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన శత్రు విమానాన్ని కూల్చేసిన అనంతరం మూడు రోజులపాటు పాక్‌లో బందీగా ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్‌) వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు వీరచక్ర శౌర్య పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం  సందర్భంగా సైనిక పురస్కారాలను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సప్పర్‌ ప్రకాశ్‌ జాధవ్‌కు ఆయన మరణానంతరం రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను కేంద్రం ఇచ్చింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌తో భారత్‌ ఆకాశంలో తలపడినప్పుడు స్క్వాడ్రన్‌ లీడర్‌గా ఉండి విమానాలను నియంత్రించిన మింటీ అగర్వాల్‌కు యుద్ధ సేవా పతకం దక్కనుంది. వాయుసేనకు 5 యుద్ధ సేవ, 7 వాయుసేన పతకాలు సహా మొత్తం 13 పురస్కారాలు దక్కనున్నాయి.

ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఐదుగురు యుద్ధ పైలట్లకు పురస్కారాలు లభించాయి. ఆర్మీకి 8 శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేనా పతకాలు దక్కాయి. నౌకాదళానికి ఒక శౌర్య చక్ర పురస్కారం లభించింది.  పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ శిక్షణా శిబిరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేయడంతో మరుసటి రోజే పాక్‌ ప్రతిదాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో పాక్‌కు చెందిన ఎఫ్‌–16 విమానాన్ని వర్ధమాన్‌ కూల్చేశారు. తాను నడుపుతున్న మిగ్‌–21 విమానం దాడికి గురవ్వడంతో ఆయన కిందకు దూకేసి ప్రాణాలతో బయటపడినప్పటికీ పాకిస్తాన్‌లో దిగారు. దీంతో ఆయనను పాకిస్తాన్‌ మూడురోజులపాటు బందీగా ఉంచుకున్న అనంతరం భారత్‌కు అప్పగించింది.

ముంబైలో జాతీయ జెండాతో సినీ నటి నిత్యా మీనన్‌

మరిన్ని వార్తలు