డేంజర్‌ జోన్‌లో ఢిల్లీ

3 Apr, 2018 08:41 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ : వేసవి ముంచుకొచ్చినా ఢిల్లీని విషవాయువులు వీడటం లేదు. విపరీతమైన వాయు కాలుష్యం రాజధానిని కమ్మేసింది. శీతాకాలంలో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన వాయుకాలుష్యం ఇప్పటికీ అదే స్ధాయిలో కొనసాగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీలో మంగళవారం ఉదయం ప్రమాదకర పీఎం 2.5 స్ధాయి 200గా నమోదైంది. ఇది సురక్షిత స్ధాయి 100 కంటే రెట్టింపు కావడం గమనార్హం. ఇక లోధి రోడ్‌లో పీఎం 2.5 స్థాయి 190గా నమోదవగా, ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరంగా 463గా నమోదైంది.

దేశ రాజధానిలో నెలకొన్న వాతావరణం ప్రమాదభరితమని, కలుషిత వాయువులతో ప్రజల ఆరోగ్యానికి పెను సవాల్‌ ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా అధికారుల్లో కదలిక లేదు. పరిస్థితి విషమించేలా ఎలాంటి ఆంక్షలు లేకుండా వాహన ట్రాఫిక్‌ యథావిధిగా కొనసాగుతూ నిర్మాణ పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్ధాలను తగలబెట్టడం ఢిల్లీ వాయు కాలుష్యానికి కారణమని అధికారులు అప్పట్లో చెప్పినా వేసవి ప్రారంభమైనా నగరంలో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. కాలం చెల్లిన వాహనాలపై కఠిన ఆంక్షలు విధించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన ఇంధనాలను వాడేలా వాహనాలను అప్‌గ్రేడ్‌ చేయడంలో అధికారుల అలసత్వం పరిస్థితి తీవ్రతకు కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు