ఈసారైనా సజావుగా సాగేనా ?

26 Nov, 2015 08:57 IST|Sakshi
ఈసారైనా సజావుగా సాగేనా ?

న్యూఢిల్లీ: శీతాకాల పార్లమెంట్ సమావేశాలను ఇటు పాలకపక్షం, అటు ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తీరుతో కుంగిపోకుండా.. ఎలాగైనా సమావేశాలను సజావుగా జరగకుండా చూడాలనే  ప్రతిపక్షాల వ్యూహాన్ని దెబ్బతీయాలని పాలకపక్షం కృతనిశ్చయంతో ఉండగా, బీహార్ ప్రజల తీర్పుతోనే మరింత బలపడిన ప్రతిపక్షాలు.. దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులు, ఆకాశన్నంటుతున్న నిత్యావసర సరకులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిరీక్షిస్తున్నాయి.

 గురువారం ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జీఎస్‌టీ లాంటి కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. సందేహాలుంటే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీరుస్తారంటూ చెప్పారు. ప్రస్తుతమున్న పద్ధతిలో మాత్రం జీఎస్‌టీ బిల్లును ఆమోదించలేమని, మార్పులు, చేర్పుల గురించి చర్చించేందుకు మాత్రం తాము సిద్ధంగానే ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అలాగే పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై, ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలోని అసహన పరిస్థితులపై నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. అసహన పరిస్థితుల కారణంగా చోటుచేసుకున్న సంఘటనలను పార్లమెంట్ ఖండించాలంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నోటీసు కూడా ఇచ్చారు.

శాంతి భద్రతల పరిరక్షణ అంశం రాష్ట్రాల పరిధిలోనిది అయినప్పటికీ దాద్రిలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఖండించారంటూ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య అఖిలపక్ష సమావేశాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు చెబుతున్న అసహన పరిస్థితులపై చర్చించేందుకు తాము వెనకాడడం లేదని, అయితే చర్చలు నిర్మాణాత్మకంగా జరగాలని కోరుకుంటున్నామని వెంకయ్య వ్యాఖ్యానించారు. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణాల్లో చిక్కుకున్న ముగ్గురు కేంద్ర కళంకిత మంత్రులను తొలగించాలంటూ విపక్షాలు గొడవ చేసిన నేపథ్యంలో గత వర్షాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన విషయం తెల్సిందే.

 26 నుంచి వచ్చే నెల 23వరకు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు ఈసారైనా సజావుగా కొనసాగుతాయన్న నమ్మకం ఏమాత్రం లేదు. నవంబర్ 26వ రోజు రాజ్యాంగ దినోత్సవం అవడం వల్ల ప్రత్యేక కార్యక్రమాల కారణంగా తొలి రెండు రోజులు సవ్యంగానే జరగవచ్చు. 1949, నవంబర్ 26ను భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా, అది 1950, జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే.
 

మరిన్ని వార్తలు