డిసెంబర్‌ 15 నుంచి శీతాకాల సమరం

25 Nov, 2017 02:27 IST|Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు నుంచే పార్లమెంట్‌ శీతాకాల సమరం మొదలు కానుంది. డిసెంబర్‌ 15న సమావేశాలు ప్రారంభమై జనవరి 5 వరకూ 14 రోజులు సభా కార్యక్రమాలు కొనసాగుతాయి. హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) తేదీలను నిర్థారించింది.  సీసీపీఏ ప్రతిపాదనలను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు.  పార్లమెంట్‌ సమావేశాల జాప్యాన్ని కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ సమర్థించుకున్నారు. జనవరి 1తో పాటు అన్ని పని దినాల్లోనూ సభ్యులు సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్‌ తలాక్, ఎన్‌సీబీసీ తదితర కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు