అమిత్ షాది విజయమా, అపజయమా?

6 Aug, 2016 18:33 IST|Sakshi
అమిత్ షాది విజయమా, అపజయమా?

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా తన విధేయుడైన విజయ్ రుపానిని ఎంపిక చేయడంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విజయం సాధించారు. కానీ ఆయనకు ఇది నిజంగా విజయమేనా? అపజయం నుంచి వచ్చిన విజయం కాదా? గత కొన్ని రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ తాజా పరిణామం ఆయన విజయం కాదని, ప్రత్యామ్నాయాన్ని సూచించడంలో మాత్రమే ఆయన విజయం సాధించినట్లు అర్థమవుతోంది. గత ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌ను అమిత్ షా తప్పించాలనుకోవడం కొత్త విషయం కాదు.

కానీ ఆమెను ఇప్పుడే తప్పించాలని భావించలేదు. ఆమెకు 75 (నవంబర్ 21వ తేదీన ఆమె పుట్టిన రోజు) ఏళ్లు నిండిన తర్వాత, అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆమెను ముఖ్యమంత్రి పదవిని తప్పించాలని అమిత్‌షా భావించారు. అప్పటికి రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత ఆమెను తప్పించి ఎన్నికలకు సారథ్యం వహించడంలో భాగంగా తానే గుజరాత్ సీఎం బాధ్యతలు స్వీకరించాలని ఆయన భావించారు. అందుకనే ఆయన తదుపరి పార్టీ అధ్యక్షుడికి వదిలేయాలనే ఉద్దేశంతో పార్టీ కేంద్ర కమిటీలను పునరుద్ధరించలేదు. ఈ విషయం ఇటు బీజేపీలో, అటు సంఘ్ పరివార్‌లో ముఖ్య నాయకులందరికి తెల్సిందే.

అమిత్ షా అంచనాలను ఆనందిబెన్ పటేల్ తన రాజీనామా నిర్ణయం ద్వారా తలకిందులు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఆమె సీఎం పదవి నుంచి తప్పుకుంటారని పార్టీ పెద్దలు భావించారు. కానీ పటేల్ అధిష్టానంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సోషల్ మీడియా ద్వారా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.  ఆ తర్వాత ముఖ్యమంత్రికి అమిత్ షా పేర్లు చక్కర్లు కొట్టింది. అందుకు కారణం అంతుకుముందు పటేల్ స్థానంలో అమిత్ షానే ముఖ్యమంత్రి అవుతారని పార్టీ నాయకులు భావించడమే.

యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ తప్పిదనం అవుతుందని ఆయన భావించారు. అందుకని కొన్ని రోజులపాటు పార్టీ పెద్దలతో తర్జనభర్జనలు పడి చివరకు తన విధేయుడైన విజయ్ రుపానీని ఎంపిక చేశారు. ఆయన కూడా అమిత్ షాలాగా జైనుడే. బీసీలు, పటేళ్ల ఆందోళనతో రగిలిపోతున్న గుజరాత్‌లో ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథంలో నడిపిస్తారా, అన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నే.

మరిన్ని వార్తలు