దివ్యాంగుడైన భర్తను భుజాలపై మోస్తూ..ఫోటో వైరల్‌

4 Apr, 2018 16:42 IST|Sakshi
బిమ్లా దేవి, బదన్‌ సింగ్‌ దంపతులు

సాక్షి, మధుర : దివ్యాంగుడైన భర్తను తన భుజాలపై ఎక్కించుకుని వెళ్తున్న ఓ మహిళ ఫోటో.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భర్తను భుజాలపై మోసుకు వెళుతున్న ఆమెకు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన  బిమ్లా దేవి అనే మహిళ.. నరాల సంబంధిత వ్యాధితో కుడికాలు కోల్పోయిన తన భర్త బదన్‌ సింగ్‌ను గత కొన్ని నెలలుగా భుజాలపై ప్రభుత్వ ఆస్పత్రికి మోసుకెళుతోంది.

బదన్‌ సింగ్‌కు వీల్‌ చైర్‌ ఇవ్వడానికి ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు... దివ్యాంగుడని ధ్రువీకరణ పత్రం తీసుకు రమ్మన్నారు. దీంతో ఆమె ఆ సర్టిఫికేట్‌ కోసం భర్తను మోసుకుని వెళుతూ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ చాలాకాలంగా తిరుగుతోంది. అయినా అధికారులు ఏమాత్రం కనికరించలేదు. సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు ఆమెను కార్యాలయం చుట్టూ తిప్పుతూనే ఉన్నారు.  ఈ సందర్భంగా బిమ్లా దేవి మాట్లాడుతూ.. ధ్రువీకరణ పత్రం పొందడానికి చాలా కార్యాలయాల చుట్టూ తిరిగాం. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయింది. అయితే భర్తను అలా మోసుకు వెళుతున్న ఆమె ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ దంపతుల ఫోటో ఉత్తరప్రదేశ్‌ మంత్రి భూపేంద్ర చౌదరి కంట పడింది. దీనిపై స్పందించిన ఆయన...  వారికి సహాయం అందకపోవడం  నాగరిక సమాజానికి సిగ్గుచేటని, వెంటనే ఆ భార్యాభర్తలకు సహాయం అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు.  

ఎట్టకేలకు బుధవారం బిమ్లా దేవి దంపతులకు ధ్రువీకరణ పత్రం అందడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొద్ది నెలల ముందు వరకు వారి జీవితం సాఫీగా సాగిపోయేదని,  నరాల వ్యాధి కారణంగా తన భర్త కాలు కోల్పోవడంతో కష్టాలు చుట్టుముట్టాయని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆటోలో వెళ్లడానికి కూడా డబ్బులు లేవని, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నామని ఆమె వివరించింది. భర్త కాలుపోవడంతో కుటుంబ భారంతో పాటు భర్తకు మందులు కొనే బాధ్యత కూడా బిమ్లా భుజాలపై పడింది. 

మరిన్ని వార్తలు