‘నా కొడుకు బాధ్యత.. ఉద్యోగం రెండూ ముఖ్యమే’

3 Mar, 2020 14:48 IST|Sakshi

లక్నో : చిన్న పిల్లల ఆలన పాలన ఎంతో కష్టంతో కూడుకున్న పని. వాళ్లకు ఎప్పుడు.. ఏం అవసరం వస్తుందో చెప్పలేం. అందుకే పిల్లల వెంట ఎప్పుడూ తల్లి ఉండాల్సిందే. కానీ ఓ తల్లి తన కొడుకు సంరక్షణతో పాటు ఉద్యోగం కూడా ముఖ్యమే అని నిరూపించింది. భూజాన చంటి పిల్లాడిని వేసుకుని విధులకు హాజరయ్యారు ఓ మహిళా పోలీస్‌. ఈ దృశ్యాలు ఉత్తర ప్రదేశ్‌లో దర్శనమిచ్చాయి. ప్రీతి రాణి అనే మహిళా కానిస్టేబుల్‌ గ్రేటర్‌ నోయిడాలోని దాద్రి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. సోమవారం నోయిడాలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ పాల్గొన్న ఓ కార్యక్రమానికి ప్రీతికి అక్కడ సెక్యూరిటీగా డ్యూటీ వేశారు. ఉదయ 6 గంటలకే తప్పని సరిగా అక్కడికి హాజరవ్వాలి.

అయితే అదే రోజు భర్తకు వేరే పని ఉండటంతో మరో మార్గం లేక తన కొడుకును వెంట పెట్టుకుని విధులకు హజరయ్యారు. మహిళా కానిస్టేబుల్‌ చంటి పిల్లవాడితో సభకు రావడంతో  అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై మహిళ స్పందిస్తూ.. ‘‘బాబు వాళ్ల నాన్నకు ఈ రోజు ఎగ్జామ్‌ ఉంది. కావున ఆయన పిల్లావాడిని తీసుకెళ్లలేడు. ఏమి చేయలేని స్థితిలో ఇలా చేశాను. నా కొడుకు సంరక్షణ నాకు ముఖ్యం. అదే విధంగా ఉద్యోగం కూడా ముఖ్యమే. అందుకే నేను తనను ఇక్కడకు తీసుకు రావాల్సి వచ్చింది’’ అన్నారు. కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం(ఆదివారం, సోమవారం) గౌతమ్‌ బుద్ద నగర్‌, గ్రేటర్‌ నోయిడాకు విచ్చేశారు. అక్కడ రూ. 1,369 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా