యాక్సిడెంట్ బాధితులకు 35 లక్షల పరిహారం

23 Feb, 2016 13:57 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళా కానిస్టేబుల్ కుటుంబానికి ట్రక్ యజమాని, బీమా సంస్థ సంయుక్తంగా 35 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని థానె మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సూచించింది. ట్రక్ యజమాని మొహమ్మద్ నజీర్ ఖాన్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ థానె కార్యాలయం కలసి ఆ డబ్బును చెల్లించాలని జడ్జ్ కె.డి. వదానె ఆదేశించారు. 2012 యాక్సిడెంట్ కేసులో తల్లిని కోల్పోయిన మహిర్ తౌఫీక్, తౌఫీక్ బాబు తాంబేలకు ఈ పరిహారం అందజేయాలని సూచించారు. ప్రమాదం జరిగిన సమయంలో మూడేళ్ల వయసున్న కొడుకు.. బాధితుడు మహిర్‌కు పరిహారంలోని 25 లక్షల రూపాయలను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.  

ప్రమాదం జరిగిన సమయంలో (జనవరి 3, 2012)  నైగోన్ నుంచి నెహ్రూనగర్ కు ద్విచక్రవాహనంపై వెడుతున్న 30 ఏళ్ల సజియా తౌఫిక్ తాంబె అలియాస్ నళిని గైక్వాడ్ సియోన్ జంక్షన్ సమీపంలో ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఆమెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఆమె.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని, రూ. 40 లక్షల నష్టపరిహారం చెల్లించాలని అప్పట్లో బాధితురాలి తరపున కేసు దాఖలు చేశారు. తమ వాదనలకు మద్దతుగా బాధితురాలి తరపు న్యాయవాది అందుకు కావలసిన పత్రాలను కూడా సమర్పించారు. కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం హక్కుదారుడు, ప్రత్యర్థుల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు వెలువరించింది. అప్పట్లో వేగంగా వస్తున్న ట్రక్  ముందు వెళ్తున్న హ్యుందయ్ కారు ఉన్నట్లుండి యూ టర్న్ తిప్పడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినట్లు ప్రత్యర్థులు సమర్పించిన పత్రాల ఆధారంగా తెలుస్తోంది. దీంతో అటు హ్యుందయ్ కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఇటు ట్రక్ డ్రైవర్ అతి వేగంపై విచారించిన కోర్టు ఘటనకు బాధ్యులైన సంబంధిత బీమా సంస్థ, ట్రక్ డ్రైవర్లు సంయుక్తంగా పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు