-

సంప్రదాయ దుస్తులు ధరించారని..

15 Mar, 2020 17:30 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హై క్లాస్‌ రెస్టారెంట్‌లో ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రాధారణలో రెస్టారెంట్‌కు వెళ్లినా ఆమెను అక్కడి సిబ్బంది లోనికి అనుమతించలేదు. వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లోని పాత్‌వేస్‌ సీనియర్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న సంగీత కె నాగ్‌ ఇటీవల కైలీన్ మరియు ఐవీ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ రెస్టారెంట్‌ సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని లోనికి అనుమతించకపోవడంతో.. అందుకు సంబంధించిన ఓ వీడియోను సంగీత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

‘ఎథినిక్ వేర్ ధరించినందుకు మాల్‌లోకి ప్రవేశించకుండా చేశారు. భారత్‌లోని ఓ రెస్టారెంట్‌.. విదేశీ వస్త్రధారణకు విలువ ఇస్తుంది. ఏది ఎమైనా ఒక ఇండియన్‌గా నేను గర్వపడతాను’ అని సందేశాన్ని కూడా పోస్ట్‌ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో సదరు రెస్టారెంట్‌ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ రెస్టారెంట్‌ చేసిన తప్పును దిద్దుకునే పనిలో పడింది. సంగీతకు క్షమాపణలు చెపుతు రెస్టారెంట్‌ యాజమాన్యం ఓ సందేశాన్ని పంపింది. తాత్కాలిక ఉద్యోగి వల్ల ఈ పొరపాటు జరిగినట్టు పేర్కొంది. ఈ విషయంపై లోతుగా విచారిస్తామని.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని తెలిపింది. అలాగే తమ క్షమాపణను అంగీకరించాల్సిందిగా సంగీతను కోరారు.

మరిన్ని వార్తలు