కరోనా.. మహిళా వైద్యురాలికి వేధింపులు

6 Apr, 2020 15:56 IST|Sakshi

సూరత్‌ : కరోనా వైరస్‌పై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులపై కొన్ని చోట్ల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా  కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న ఓ మహిళా వైద్యురాలికి దారుణమైన పరిస్థితి ఎదురైంది. వైద్యురాలి పొరుగింటి వ్యక్తి ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. ఆమెను దూషించడమే కాకుండా.. దాడికి కూడా యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. సూరత్‌ సివిల్ హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా డాక్టర్‌పై పొరుగింటి వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను దారుణంగా తిట్టడంతో పాటు, భౌతికంగా దాడి చేయాలని చూశాడు. ఆమె వల్ల తమకు కూడా కరోనా వస్తుందని అర్థం లేని మాటలు మాట్లాడాడు. డాక్టర్‌పై దాడి జరుగుతున్నా పక్కన ఉన్నవారు చూస్తూ ఉండిపోయారు. ఓ మహిళ అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అతను వినిపించుకోవలేదు. అయితే ఆ వ్యక్తి తనతో ప్రవర్తించిన తీరును ఆ వైద్యురాలు ఫోన్‌లో వీడియో తీశారు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన కాంగ్రెస్‌ నేత శ్రీవత్స.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీని కోరారు. ఇప్పటికే పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ లభించక ఇబ్బందులు పడుతున్న వైద్యులు.. ఇప్పుడు సమాజంలో కూడా ఒంటరి కావాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు