కరోనాను జయించడమే కాక..

13 Jul, 2020 20:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా : వయసు పైబడినవారు కరోనా నుంచి కోలుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళ.. కరోనా నుంచి కోలుకోవడమే కాకుండా తన 38 ఏళ్ల కొడుక్కి కిడ్నీ దానం చేసి ప్రాణాలు నిలిపారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌కు చెందిన ఉత్తమ్‌ కుమార్‌ ఘోష్‌ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స కోసం తన తల్లి కల్పన, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాకు వచ్చారు. ఉత్తమ్‌ను పరీక్షించిన ఆర్‌ఎన్‌ ఠాగూర్‌ ఆస్పత్రి వైద్యులు.. మార్చిలో శస్త్ర చికిత్స చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఉత్తమ్‌ తల్లి నుంచి అతనికి కిడ్నీ మార్పిడి చేయాలని భావించారు. అయితే అప్పుడే కరోనా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో అది కాస్త వాయిదా పడింది. (ఊరట : 63 శాతానికి పెరిగిన రికవరీ రేటు)

ఆ తర్వాత కొద్ది రోజులకు అత్యవసర చికిత్సలకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతి ఇవ్వడంతో.. ఉత్తమ్‌ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే సమయంలో తల్లి కొడుకులకు కరోనా సోకడంతో వారిలో ఆందోళన మొదలైంది. కరోనా సోకినవారిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంఆర్‌ బంగూరు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ కోలుకున్న తర్వాత జూన్‌ 12 తిరిగి ఆర్‌ఎన్‌ ఠాగూర్‌ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ వైద్యులు వారిని 20 రోజులకు పైగా క్వారంటైన్‌లో ఉంచారు. ఆ తర్వాత మరో రెండు సార్లు వారిద్దరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వారు పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నారని తెలిశాక.. కిడ్నీ మార్పిడి చేశారు. ఆపరేషన్‌ తర్వాత తల్లికొడుకుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఉత్తమ్‌ బాగానే ఉన్నాడని.. తమ అంచనాలకు అనుగుణంగా కోలుకుంటున్నాడని తెలిపారు. (ఫేస్‌బుక్‌ బ్యాన్‌: కోర్టును ఆశ్రయించిన ఆర్మీ అధికారి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా