మెట్రోరైలు దిగుతున్న సమయంలో.. అనూహ్యంగా

16 Apr, 2019 14:59 IST|Sakshi

న్యూఢిల్లీ : నగరమంటేనే ఉరుకుల-పరుగుల జీవితం. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ మెట్రోరైళ్లు నడుస్తున్నాయి. మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు, ముఖ్యంగా మెట్రో రైలు నుంచి దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన చాటుతోంది. ఓ 40 ఏళ్ల మహిళ మెట్రో రైలు దిగుతుండగా.. ఆమె చీర బోగీ డోర్‌లో చిక్కుకుపోయింది. దీంతో ఆమెను ఫ్లాట్‌ఫామ్‌ మీద మెట్రోరైలు లాక్కెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ బటన్‌ నొక్కడంతో ఆ మహిళకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలయ్యాయి. బ్లూలైన్‌ మార్గంలోని మోతినగర్‌ మెట్రో స్టేషన్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలిని గీతగా గుర్తించారు. గీత తన కూతురితో కలిసి.. మోతినగర్‌ మెట్రో స్టేషన్‌లో దిగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ‘నవాడా నుంచి గీత, నా కూతురు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మోతినగర్‌లో ఆమె దిగారు. అయితే, దిగే సమయంలో ఆమె చీర మెట్రో బోగీ డోర్‌లో చిక్కుకొని.. డోర్‌ మూతపడింది. దీంతో మెట్రో రైలు కదలడంతోపాటు ఆమెను ఫ్లాట్‌ఫాం మీద ఈడ్చుకెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రయాణికుడెవరో ఎమర్జెన్సీ బటన్‌ నొక్కారు. దీంతో డ్రైవర్‌ రైలును ఆపారు’ అని ఆమె భర్త జగదీశ్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన గీతను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. మోతినగర్‌ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరిగిన విషయం వాస్తవమేనని, ఈ ఘటనతో ఈ మార్గంలో మెట్రో సేవల్లో కొంత అంతరాయం ఏర్పడిందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు