మహిళా ఇంజనీరును కుర్చీకి కట్టేసి.. సజీవ దహనం

25 Oct, 2016 17:00 IST|Sakshi
మహిళా ఇంజనీరును కుర్చీకి కట్టేసి.. సజీవ దహనం
బిహార్‌లో దారుణం జరిగింది. మహిళా ఇంజనీరును కుర్చీకి కట్టేసి, సజీవదహనం చేశారు. ఈ కేసులో ఆ భవన యజమానితో పాటు ఆమె మాజీ భర్తను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సరితాదేవి (42) సీతామాడి జిల్లాలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఆమె తన చిన్న కొడుకు ఆర్యన్‌తో కలిసి ఒక్కరే ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. పెద్దకొడుకు ధ్రువ్ ఆమె భర్త విజయ్ నాయక్‌తో పాటు ఉంటాడు. దంపతులిద్దరూ పదేళ్ల క్రితమే విడిపోయారు. విజయ్ నాయక్ అక్కడకు 65 కిలోమీటర్ల దూరంలోని సీతామాడిలో ఉంటాడు. 
 
రెండు రోజుల క్రితం సరితాదేవి తన కొడుకు ఆర్యన్‌ను తన పుట్టింటికి పంపింది. తర్వాత.. ఈ ఘోరం జరిగిపోయింది. ఈ దారుణానికి పాల్పడిందెవరో తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. సరితాదేవి మాజీ భర్త విజయ్ నాయక్‌తో పాటు భవన యజమాని విజయ్ గుప్తాను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సీతామాడి సీనియర్ ఎస్పీ వివేక్ కుమార్ తెలిపారు. భవన యజమాని తరచు ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడని పోలీసులు చెప్పారు. ప్రాజెక్టుల అంచనాలు తయారుచేయడంలో అతడు ఆమెకు సాయపడుతుండేవాడు. సరితాదేవి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జేఈగా పనిచేస్తున్నారు. ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందో కూడా తెలియడం లేదు. అయితే హంతకులు ఆమె మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలు కూడా చల్లారు. దాంతో ఇరుగుపొరుగువారికి కూడా అనుమానం రాలేదు. ఎప్పటిలాగే ఆ ఇంటికి వచ్చిన యజమాని విజయ్ గుప్తా.. సరితాదేవి మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. 
మరిన్ని వార్తలు