నిఖా హలాల పేరిట నరకం...

16 Jul, 2018 20:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : లింగ సమానత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉన్న నిఖా హలాల్‌, బహు భార్యత్వాల చట్ట బద్ధత గురించి చర్చించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రానికి గత మార్చిలో నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకు పలువురు బాధిత మహిళలు ముందుకొస్తున్నారు. నిఖా హలాల నియమం వల్ల తాము ఎంతటి క్షోభ అనుభవిస్తున్నామో చెప్పేందుకు సోషల్‌​ మీడియాను వేదికగా చేసుకున్నారు బరేలీకి చెందిన నీదా ఖాన్‌, షబీనా.

నియమం పేరిట నరకం..
బరేలీకి చెందిన షబీనాకు ఓ వ్యక్తితో నిఖా జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఆమె భర్త మూడు సార్లు తలాక్‌ చెప్పడంతో వారి వివాహం రద్దు అయింది. అయితే మళ్లీ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె భర్త, తన తండ్రిని పెళ్లి చేసుకోవాల్సిందిగా షబీనాను ఒత్తిడి చేశాడు. దీంతో భర్తతో విడాకులు పొందిన అనంతరం నిఖా హలాల నియమం ప్రకారం షబీనా ఆమె మామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

కొన్నాళ్ల తర్వాత భర్త తండ్రితో విడాకులు పొంది, భర్తతో జీవితాన్ని పంచుకోవాలని భావించిన షబీనాకు.. తన సోదరుడిని వివాహం చేసుకోవాలంటూ ట్విస్ట్‌ ఇచ్చాడు ఆమె మొదటి భర్త. దీంతో నియమం పేరిట తన జీవితంతో ఆటలాడుకుంటున్నారని గ్రహించిన షబీనా.. నీదా ఖాన్‌(బరేలీలో ప్రఖ్యాత దర్గా అలా హజ్రత్‌ కుటుంబానికి చెందిన మహిళ)ను కలిసి తన సమస్యను వివరించింది. నీదా కూడా షబీనా లాగే ట్రిపుల్‌ తలాక్‌ బాధితురాలు కావడంతో ఇద్దరు కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చంపుతామని బెదిరింపులు..
నీదా ఖాన్‌, షబీనాలు స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేయడాన్ని తట్టుకోలేని ‘పెద్దలు’  చంపుతామంటూ వారిని బెదిరించడంతో వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన బరేలీ ఇమామ్‌ ముఫ్తీ ఖుర్షీద్‌ ఆలం మాట్లాడుతూ... కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే కావాలనే కొందరు ఇస్లాం నియమాలను మంటగలపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందినీ షరియత్‌ చట్టాల ప్రకారం పని గట్టుకొని బహిష్కరించాల్సిన పని లేదని, అలా మాట్లాడిన మరుక్షణమే వారు ఇస్లాం వ్యతిరేకులుగా మారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా నియమాల పేరిట ఆటవిక చర్యలకు పాల్పడం సరికాదని సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిఖా హలాల్‌...
ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది.

మరిన్ని వార్తలు