భర్త శవంతో పాటు భార్యను...

12 Jul, 2019 17:35 IST|Sakshi

లక్నో: భర్త శవంతో పాటు భార్యను బస్సులోంచి దారి మధ్యలో దించేసిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి రాజు మిశ్రా(37), అతడి భార్య బహ్రాయిక్‌ నుంచి లక్నో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. మార్గ మధ్యలో బారబాంకి సమీపంలో రాజుకు గుండెపోటు వచ్చింది. వైద్య సహాయం అందకపోవడంలో బస్సులోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే భర్త శవంతో పాటు తన మరదలిని బలవంతంగా బస్సు నుంచి కండక్టర్‌ సల్మాన్‌, డ్రైవర్‌ జునైద్‌ అహ్మద్‌ దించేశారని రాజు అన్నయ్య మురళి మిశ్రా ఆరోపించారు. ఆధారాలు లేకుండా చేసేందుకు ఆమె దగ్గర నుంచి టికెట్లు కూడా లాక్కునిపోయారని చెప్పారు.

ఈ ఆరోపణలను కండక్టర్‌, డ్రైవర్‌ తోసిపుచ్చారు. రాజుకు గుండెపోటు రావడంతో బస్సులో ఉన్న డాక్టర్‌ ఒకరు పరీక్షించారని, తన వల్ల కాదని ఆయన చెప్పడంతో రామ్‌నగర్‌లోని ప్రైవేటు వైద్యుడు డీపీ సింగ్‌కు చూపించగా రాజు మరణించినట్టు నిర్ధారించారని చెప్పారు. పోలీసులకు సమాచారం అందించేందుకు 100 నంబరుకు ఫోన్‌ చేసినా స్పందన రాలేదన్నారు. రామ్‌నగర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ శ్యామ్‌ నారాయణ్‌ పాండేకు ఫోన్‌ చేయగా.. మృతదేహాన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని సూచించినట్టు చెప్పారు. రాజు భార్య తన బంధువులకు ఫోన్‌ చేసి మాట్లాడిన తర్వాత భర్త మృతదేహంతో బస్సు దిగిపోయిందని తెలిపారు.

అక్కడికి పోలీసులను పంపి మృతదేహాన్ని బారబాంకీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు స్టేషన్‌ ఆఫీసర్‌ నారాయణ్‌ పాండే వెల్లడించారు. రాజు మృతదేహానికి వైద్యులు గురువారం పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు. ఈ వ్యవహారాన్ని  ఓ వ్యక్తి ట్విటర్‌ ద్వారా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు