సిబ్బంది నిర్లక్ష్యం.. ఆస్పత్రి డ్రైనేజిలో ప్రసవించిన మహిళ

16 Dec, 2017 17:48 IST|Sakshi

కొరాపుట్ : ఓ ఆదివాసీ మహిళ అత్యంత దయనీయ స్థితిలో ఆస్పత్రి ప్రాంగణంలోని డ్రైనేజీలో ప్రసవించిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కొరాపుట్ జిల్లా దస్మంత్‌పూర్‌ బ్లాక్‌, జానిగూడకు చెందిన మహిళ.. తన తల్లి, సోదరితో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మణ్‌ నాయక్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (ఎస్‌ఎల్‌ఎన్‌ఎంసీహెచ్‌)కు వచ్చారు. జ్వరంతో బాధపడుతూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న తన భర్తను చూసేందుకు వచ్చిన ఆమెకు ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి...

కుటుంబీకులు ఆమెను గైనకాలజీ వార్డుకు తీసుకెళ్లగా.. చికిత్స అందించేందుకు సిబ్బంది నిరాకరించారు. నొప్పులను దిగమింగుతూ ఆస్పత్రి బయటికి వచ్చేసిన ఆ మహిళ.. పక్కనున్న డ్రైనేజీలో పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి సిబ్బంది స్పందించి, వారిని లోనికి తీసుకెళ్లారు. ‘‘పిల్లకు నొప్పులుస్తున్నాయని ఎంత ప్రాధేయపడినా వాళ్లు వినలేదు. ఇంతకుముందు డాక్టర్‌ దగ్గర చూపించుకున్న కాగితాలు తెమ్మని అడిగారు. మా ఊరు చాలా దూరం అప్పటికప్పుడు తేలేమన్నా వినిపించుకోలేదు’’ అని బాధిత మహిళ తల్లి మీడియాతో చెప్పారు.

మూత్రవిసర్జనకు వెళ్లి.. : కాగా, డ్రైనేజీలో ప్రసవం ఘటనపై ఉన్నతాధికారులు భిన్నంగా స్పందించారు. వారసలు గైనకాలజీ వార్డుకే రాలేదని, మూత్రవిసర్జన కోసం వెళ్లి డ్రైనేజీలో బిడ్డను కన్నారని కొరాట్‌పూర్‌ జిల్లా వైద్య అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

ప్రసవం తర్వాత మహిళను ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్న సిబ్బంది

మరిన్ని వార్తలు