ఛ..! ఇ‍వ్వడంలో ఇంత ఆనందం ఉందా?!

17 Jan, 2020 10:04 IST|Sakshi

ఇతరుల అవసరాలు గుర్తించి.. వారు అడగకుండానే  తోచిన సహాయం చేయడంలో ఆత్మసంతృప్తి ఉంటుంది. అయితే ఈ సాయాన్ని దానం చేయడం అనడం కంటే.. మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడం కోసం చేసే మానసిక వ్యాయామం అంటే బాగుంటుంది కదా అంటోంది ఓ యువతి. ప్రఖ్యాత హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ఫేస్‌బుక్‌ పేజీలో తన అనుభవాలు పంచుకుంది. ‘‘చాలా ఏళ్ల క్రితం.. స్కూళ్లో జరిగిన ఫ్యాషన్‌ షోలో నాకు బహుమతిగా 2000 రూపాయలు లభించాయి. రైళ్లో కూర్చుని వాటిని ఎలా ఖర్చు పెట్టాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నా. అప్పుడే ఓ పిల్లాడు ఏడుస్తూ నా కంటపడ్డాడు. తను నా వైపు చూస్తు నీళ్లు కావాలని అడిగాడు. అయితే అప్పుడు నా దగ్గర వాటర్‌ బాటిల్‌ లేదు. దీంతో అతడు మనసు​ చిన్నబుచ్చుకున్నాడు. వెంటనే తన దగ్గరికి వెళ్లి ఏం జరిగింది.. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. 

తాను తల్లితో పాటు రైల్వే స్టేషను దగ్గర కలరింగ్‌ పుస్తకాలు అమ్ముతానని.. అయితే కొద్దిసేపటి క్రితం పోలీసులు వచ్చి వాళ్లను వెళ్లగొట్టారని చెప్పాడు. అందుకే ఇప్పుడు రైళ్లో పుస్తకాలు అమ్మాలని ప్రయత్నిస్తున్నామని.. కానీ ఒక్కరు కూడా వాటిని కొనడం లేదని తన బాధను చెప్పుకొన్నాడు. వాడి కన్నీళ్లు చూస్తే నాకు దుఃఖం ఆగలేదు. మనసు ద్రవించిపోయింది. అందుకే వెంటనే నా దగ్గరున్న డబ్బు తీసి వాడి చేతిలో పెట్టాను. ఇంతలో మరికొందరు ఆడవాళ్లు నా చుట్టూ చేరారు. వాడి తల్లి దగ్గర ఉన్న బ్యాగులో 10, 20 రూపాయల నోట్లు వేయడం మొదలుపెట్టారు. నేను, ఆ పిల్లాడు అలా చూస్తుండిపోయాం. కొద్ది నిమిషాల్లోనే వాళ్ల అమ్మ చేతిలోని సంచీ నిండిపోయింది. వాడి కన్నీళ్లు చెరిగిపోయాయి. ఆశ్చర్యంతో ముఖం వెలిగిపోయింది. 

వాడు కూడా నేను దిగే స్టేషనులోనే దిగిపోయాడు. ఎందుకో తనను వదిలి వెళ్లాలనిపించలేదు. నాతోపాటు తీసుకువెళ్లి వడా పావ్‌ తినిపించాను. కానీ ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదు. తినడం అయిపోగానే వాడు నాకు గుడ్‌ బై చెప్పి వాళ్ల అమ్మ దగ్గరికి పరిగెత్తాడు. సంతోషంతో నిండిపోయిన వాడి ముఖం చూసినప్పుడే నాకు అర్థమైంది.. ఇవ్వడంలో ఇంత ఆనందం ఉంటుందా అని.. నా హృదయం సంతృప్తితో నిండిపోయింది’’ అంటూ సదరు యువతి తన అనుభవాన్ని పంచుకుంది. ఇప్పటికే వేలల్లో లైకులు సాధించిన ఈ పోస్టు.. నెటిజన్ల మనసును దోచుకుంటోంది. చిన్న చిన్న విషయాల్లో ఉండే ఆనందం గురించి మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటూ నెటిజన్లు సదరు యువతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు