మరో.. జన్మనిచ్చారు..! 

27 Oct, 2019 08:44 IST|Sakshi
ఘాట్‌ రోడ్‌లో స్ట్రైచర్‌పై గర్భిణిని తీసుకు వస్తున్న దృశ్యం

సాక్షి, భువనేశ్వర్‌ : మాటలు కోటలు దాటుతున్నా.. కాలు గడప దాటని చందంగా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలు తీరు ఉందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భిణులు, గ్రామీణ రోగులకు వైద్య సౌకర్యాలు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నట్లు చెబుతున్నా.. అవేమీ బాధితుల దరి చేరడం లేదు. ప్రసూతి కోసం కిలోమీటర్ల దూరం మోసుకు వచ్చే పరిస్థితి అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో ఇంకా కొనసాగుతుంది. గ్రామాలకు అందుబాటులో వైద్య, రోడ్డు సౌకర్యాలు లేకపోవడంతో రోగులను ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు గ్రామస్తులకు అవస్థలు తప్పడం లేదు. నిండు గర్భిణిని మహిళలు 4 కిలోమీటర్లు భుజాలపై మోసుకు వచ్చిన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే... కొరాపుట్‌ జిల్లా నారాయణపట్నం బ్లాక్‌ సమితి బిజాపూర్‌ పంచాయతీ ఉప్పరగొడితి గ్రామానికి చెందిన మీణంగి జానికి శనివారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు స్థానిక ఆశ కార్యకర్తకు సమాచారం అందించగా.. ఆమె వెంటనే 102 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అయితే ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్‌ చేరుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు. అప్పటికే మీణంగికి నొప్పులు తీవ్రం కావడం, మగవారు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లకు చెందిన మహిళలు గుమిగూడారు. ఎలాగైనా తామే ఆస్పత్రికి చేర్చాలని నిర్ణయానికి వచ్చారు.

స్ట్రైచర్‌పై ఘాట్‌ రోడ్‌లో..
ఉప్పరగొడితి నుంచి సుమారు 4 కిలోమీటర్ల వరకు రోడ్డు సౌకర్యం లేదు. దీంతో వాహనాలు తిరిగే అవకాశం లేకపోయింది. దీంతో మహిళలు ఇంద్రా సీత, తులసీ జానీ, బిరమ జానీ, కుమారి జానీ, సిందే జానీ, హికమే పూజారి, సిలా జానీ, పరమ జానీ, టీకే జానీ, ఎప్తా పూజారి, సిలా జానీ తదితరులు స్ట్రైచర్‌పై మీణంగిణి కూర్చోబెట్టి, భుజలపై మోస్తూ ఘాట్‌ రోడ్‌లో కొండ దిగి, మతలాపుట్‌ ఆస్పత్రికి చేర్చారు. అక్కడ ఆమె పండంటి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, సకాలంలో తీసుకు రావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా... ఆ ప్రాంతంలో ఉప్పర గొడితి, తొలగొడితి, మఝిగొడితి, ఉప్పర రంగపాణి, తొలరంగపాణి, కుతుడి తదితర గ్రామాలకు రహదారులు లేవని గ్రామస్తులు చెబుతున్నారు.

దీంతో అత్యవసర సమయంలో వైద్యం అందక, ప్రాణాలు కోల్పోతున్నామని వాపోతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించాలని పరిసర గ్రామాలకు చెందిన వారు కోరుతున్నారు. అలాగే ఎంతో కష్టానికి ఓర్చి, గర్భిణిని భుజాలపై మోస్తూ ఆస్పత్రికి చేర్చిన మహిళలను పలువురు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు