గబ్బిలాల బామ్మ.. నిపా భయం లేదు..!!

26 May, 2018 14:58 IST|Sakshi
గబ్బిలాలతో శాంతాబెన్‌

అహ్మదాబాద్‌, గుజరాత్‌ : దేశమంతటా నిపా వైరస్‌ భయంతో వణికిపోతోంటే ఓ 74 ఏళ్ల బామ్మ మాత్రం 400 గబ్బిలాలతో కలసి నివసిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అహ్మదాబాద్‌కు చేరువలోని రాజ్‌పూర్‌ గ్రామంలో శాంతాబెన్‌ ప్రజాపతి(74) నివసిస్తున్నారు. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.

ఆమెకు రెండు గదుల ఇల్లు ఉంది. ఇంటిలోని అన్ని గోడలపై, కింద కూడా 400 గబ్బిలాలు నివసిస్తుంటాయి. నిపా వైరస్‌ గురించి తనకు ఎలాంటి భయం లేదని శాంతాబెన్‌ తెలిపారు. గత పదేళ్లుగా గబ్బిలాలతో గడుపుతున్నానని, అవి తన కుటుంబం అని చెప్పారు. అందుకే వాటి కోసం ఇంటిని వదిలేసి వరండాలో కాలాన్ని వెళ్లదీస్తున్నట్లు వెల్లడించారు.

పదేళ్ల క్రితం ఓ గబ్బిలాల గుంపు ఇంట్లోకి వచ్చిందని వాటిని చూసి చాలా భయపడ్డానని శాంతాబెన్‌ తెలిపారు. రాత్రి పూట అవి బయటకు వెళ్లి, ఉదయాన్నే తిరిగి వచ్చేవని వివరించారు. అప్పటికే తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసినట్లు చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నాడని దాంతో ఇంటికి గబ్బిలాలకే వదిలేసినట్లు వెల్లడించారు. తాను ప్రాణాలతో ఉన్నంతవరకూ గబ్బిలాలతోనే నివసిస్తానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు