నన్నే తిరిగి డబ్బులు అడుగుతావా?.. బెంగాల్‌లో దారుణం

21 Aug, 2019 12:01 IST|Sakshi

కలకత్తా : తను ఇచ్చిన లంచం తిరిగి ఇవ్వమనడమే ఆమె నేరమైంది. నన్నే తిరిగి డబ్బులు అడుగుతావా అంటూ ఓ పార్టీ నాయకుడు తన అనుచరులతో కలసి ఆమెను దారుణంగా రేప్‌ చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తాజాగా తమ పార్టీ కార్యకర్తలకు లంచాలు తీసుకోవద్దని, ఇప్పటికే తీసుకుంటే తిరిగివ్వండని పిలపునిచ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎవరైనా పార్టీ కార్యకర్త లంచం తీసుకున్నట్లయితే వెంటనే తిరిగి ఇవ్వాలని సూచించారు. మమతా బెనర్జీ పిలుపుతో చాలా మంది పార్టీ కార్యకర్తలు తాము తీసుకున్న లంచాన్ని తిరిగివ్వడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని మైనాగురి ప్రాంతానికి చెందిన ఓ పేద మహిళ  ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన తృణమూల్‌ కార్యకర్త, పంచాయతీ నాయకుడు లంచం డిమాండ్‌ చేయడంతో రూ.7000 ఇచ్చింది. సంవత్సరం నుంచి ఇంటి నిర్మాణానికి ఒక్క రూపాయి విడుదల కాకపోయినా ఆమె అతన్ని నిలదీయలేదు. కానీ తాజాగా మమతా బెనర్జీ తన కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు మేరకు తన డబ్బులు వస్తాయనే ఆశతో ఆగస్టు 14న వెళ్లి అడిగింది. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ ఆ ‘నాయకుడు’ ఆమెను దారుణంగా హింసించడమేగాక తన అనుచరులతో కలసి గ్యాంగ్‌రేప్‌ చేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను ఇంతవరకూ అరెస్టు చేయలేదు. ఈ అంశం తాజాగా వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ‘మమతాజీ మీ కార్యకర్తలు మీ పిలుపుకు బాగా ప్రతిస్పందించారని’ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో తాజా ఘటన మమతకు రాజకీయంగా మరిన్ని తలనొప్పులు తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు