మంగళ సూత్రం తాకట్టుపెట్టి...

18 Jul, 2016 17:19 IST|Sakshi
మంగళ సూత్రం తాకట్టుపెట్టి...

బీహార్ః ప్రతిఇంట్లో మరుగుదొడ్లు ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే వాటి నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా.. సబ్సిడీలు ఇచ్చినా చాలా ప్రాంతాల్లో ఆచరణలోకి మాత్రం రావడం లేదు. అయితే బీహార్ కు చెందిన ఓ మహిళ మాత్రం.. మరుగుదొడ్డి సమస్యను అధిగమించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్మాణానికి అయ్యే ఖర్చుకోసం  ఏకంగా మంగళ సూత్రాలు తాకట్టు పెట్టేసింది.   

భర్త అవసరాలకో, కూతుళ్ళ పెళ్ళిళ్ళకో బంగారం, వెండి, నగలు అమ్మకాలు జరపడం, తాకట్టు పెట్టడం చాలా కుటుంబాల్లో జరుగుతుంటుంది.  అయితే బీహార్ లోని రోటాస్ జిల్లా, బరఖన్నా గ్రామానికి చెందిన ఫుల్ కుమారి మాత్రం.. టాయిలెట్ నిర్మాణానికి వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇంట్లో డబ్బు ఇబ్బందులతో సమస్యగా మారిన మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టేందుకు మంగళ సూత్రాలను తాకట్టు పెట్టేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇంట్లోనివారు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించినా.. జిల్లా అధికారులు మాత్రం ఆమెను ఎంతో అభినందించడంతోపాటు.. ఆమెను ఏకంగా  జిల్లా పారిశుద్ధ్య కార్యక్రమానికి  బ్రాండ్ అంబాసిడర్ గా చేసేందుకు నిర్ణయించారు.  

వ్యవసాయ కూలీ అయిన భర్త ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో.. ఇంట్లో టాయిలెట్ నిర్మించుకోవడం కుమారి కుటుంబానికి ఎంతో కష్టసాధ్యమైంది. దీంతో తనవంతు సంపాదనకోసం  స్థానిక ప్రైమరీ స్కూల్లో వంటమనిషిగా చేరిన కుమారి.. ఫలితం పెద్దగా లేకపోవడంతో సూత్రాలు తాకట్టు నిర్ణయం తీసుకున్నట్లు పంచాయితీ అధికారులు తెలిపారు. ఇంట్లోని మగవారు మంగళసూత్రాల తాకట్టుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, అయితే మరుగుదొడ్డి నిర్మాణానికి కావలసిన సొమ్ము కోసం కుమారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా కుమారి భర్త, ఆమె మామగారు సమక్షంలోనే ఆమె ఇంట్లో టాయిలెట్ నిర్మాణ ప్రారంభోత్సవానికి ఇతర జిల్లా అధికారులతోపాటు తాను హాజరౌతున్నట్లు రోటాస్ జిల్లా మెజిస్ట్రేట్ అనిమేష్ కుమార్ పరాశర్ తెలిపారు. కేవలం పది రోజుల్లోగా నిర్మాణం పూర్తయ్యేట్లు చూస్తామని,  జిల్లాలోనే ఇతరులకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిన కుమారిని పారిశుద్ధ్య కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నట్లు పరాశర్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు