'సీఎంతో రాయించుకొని రా.. ఎప్పటికీ చెక్‌ చేయం'

25 Jun, 2017 18:28 IST|Sakshi
'సీఎంతో రాయించుకొని రా.. ఎప్పటికీ చెక్‌ చేయం'
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ సీనియర్‌ మహిళా పోలీసు అధికారి కొంతమంది బీజేపీ కార్యకర్తలకు గట్టి ఝలక్‌ ఇచ్చింది. సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి జరిమాన విధించి, అరెస్టు చేయడంపై ఆందోళన చేయబోయిన వారికి ధైర్యంగా సమాధానం చెప్పింది. చుట్టుపదుల సంఖ్యలో వారంతా గుమిగూడి ఆమెను బెదిరించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం భయపడకుండా వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది.

'మీ వాహనాలు తనిఖీ చేయకూడదని వెళ్లి ముఖ్యమంత్రితో లిఖిత పూర్వక అనుమతి లేఖను తీసుకొని రండి.. అలా అయితే మేం ఏం చెయ్యం. ఇంత రాత్రిళ్లుపూట మా కుటుంబాలను వదలేసి సరదా కోసం ఇక్కడకు రాలేదు.. మా విధులు మేం నిర్వర్తిస్తున్నాం' అంటూ వారికి ఘాటు సమాధానం ఇచ్చింది.

అంతేకాదు.. 'మీరు మీ పార్టీకి(బీజేపీకి) చెడ్డపేరు తెస్తున్నారు. ప్రజలు త్వరలోనే మిమ్మల్ని బీజేపీ గుండాలని అంటారు' అని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రమోద్‌లోదీ అనే జిల్లాస్థాయి బీజేపీ నేత సరైన పత్రాలు లేకుండానే వాహనాలు నడుపుతున్నాడని గుర్తించిన పోలీసులు అతడికి జరిమానా విధించారు. దీంతో అతడు పోలీసులతో దురుసుగా ప్రవర్తింగా అరెస్టు చేశారు. దీనిపై రచ్చ చేసే ప్రయత్నం చేయగా శ్రేష్ట ఠాకూర్‌ అనే సర్కిల్‌ అధికారి తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.
మరిన్ని వార్తలు