సీఏఏ నిరసనల్లో ‘పాక్‌ జిందాబాద్‌’ నినాదాలు

21 Feb, 2020 04:11 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో జరిగిన పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలో ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ నినాదాలు నిర్వాహకులను ఇబ్బందిపెట్టాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సమక్షంలోనే ఒక మహిళ ఈ నినాదాలు చేసింది. ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పేరుతో బెంగళూరులో గురువారం సీఏఏ వ్యతిరేక ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనకు అసదుద్దీన్‌ ఓవైసీ కూడా హాజరయ్యారు. ఆయన రాగానే వేదికపైకి వచ్చిన అమూల్య లియోనా అనే మహిళ ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని నినదించడం ప్రారంభించింది. అక్కడ ఉన్న ఆందోళనకారులను కూడా తనతో పాటు నినదించమని కోరింది. నిర్వాహకులు అడ్డుకున్నా.. ఆమె ఊరుకోలేదు. ఈ లోపు ఆమె దగ్గరకు వెళ్లిన అసదుద్దీన్‌ ఆమె వద్ద నుంచి మైక్‌ను లాగేసుకోవడానికి ప్రయత్నించారు.

చివరకు పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై దేశద్రోహం కేసు పెట్టే అవకాశముంది. కాగా, ఆ తరువాత ప్రసంగించిన అసదుద్దీన్‌.. ఆ మహిళతో, ఆమె అభిప్రాయాలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిర్వాహకులు ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ఉంటే బావుండేదన్నారు. ‘ఆమె ఇలా ప్రవర్తిస్తారని తెలిస్తే.. నేను ఈ కార్యక్రమానికి వచ్చేవాడిని కాదు. మేం భారతీయులం. శత్రుదేశం పాకిస్తాన్‌కు మద్దతిచ్చే ప్రశ్నే లేదు. భారత్‌ను కాపాడాలనేదే మా ఉద్యమం ఉద్దేశం’ అని ఓవైసీ వివరించారు. ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలన్నీ పాకిస్తాన్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని జాతివ్యతిరేక శక్తుల మధ్య జాయింట్‌ వెంచర్‌లో భాగమని ఆరోపించింది. బెంగళూరు ఘటనను కాంగ్రెస్‌ కూడా ఖండించింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా