ఆ కారణంతో జాబ్‌లోంచి తీసేశారు.. ఫైర్‌ అయిన కోర్టు!

4 Dec, 2018 12:20 IST|Sakshi

పుణె : హెచ్‌ఐవీ గురించి ఎన్నో కోట్లు పెట్టి ప్రచారాలు, వాణిజ్య ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. హెచ్‌ఐవీ సోకిందని ఓ వ్యక్తిని దూరంపెట్టకూడదని పదేపదే చూపిస్తున్నారు. కానీ ఇదే కారణాన్ని చూపుతూ ఓ మహిళను ఉద్యోగంలోంచి తీసేసింది ఓ సంస్థ. అయితే ఈ సంఘటన 2015లో జరిగింది. పుణెకు చెందిన మహిళ.. తన అవసరాల కోసం మెడికల్‌ క్లెయిమ్‌కు తాను పనిచేస్తున్న కంపెనీకి దరఖాస్తు చేసుకోగా.. అందులో తనకు హెచ్‌ఐవీ ఉందని తేలింది. దీంతో సదరు కంపెనీ యాజమాన్యం ఆమెను రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేసింది.

అయితే ఈ వ్యాధి తనకు తన భర్త వల్ల వచ్చిందని, తన భర్త కూడా మరణించాడని, ఇంట్లో వారు కూడా దగ్గరకు రానివ్వడంలేదని, తనకు ఉద్యోగం అవసరమని వాపోయింది. అయినా కంపెనీ యజమానులు వినిపించుకోకుండా.. రాజీనామా చేయాల్సిందే అని ఒత్తిడి చేశారు. అయితే దీనిపై కోర్టులో కేసు వేసిన ఆ మహిళకు మూడేళ్ల తరువాత న్యాయం జరిగింది.  హెచ్‌ఐవీ ఉందన్న కారణంతో ఆమెను ఉద్యోగంలోంచి తీసేయడం సరికాదని.. సదరు కంపెనీపై న్యాయస్థానం మండిపడింది. మళ్లీ తనను ఎప్పటిలాగే ఉద్యోగంలో చేర్చుకోవాలని, ఈ మూడేళ్ల జీతభత్యాలు కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు