సరైన భాగస్వామిని వెదకలేకపోయారుగా.. అందుకే

3 Oct, 2018 14:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్‌ : ‘మంచి సంబంధం కోసం వెదుకుతున్నారా.. అయితే మీరు మా సైట్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేసుకోవాల్సిందే. మీరు కోరుకున్న లక్షణాలున్న భాగస్వామిని వెదికి పెట్టే బాధ్యత మాది’  అంటూ మ్యాట్రిమొనీలు యాడ్‌లతో యువతను ఆకర్షించడం మామూలే. చండీగఢ్‌ కేంద్రంగా పనిచేసే వెడ్డింగ్‌ విష్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇచ్చిన ఇలాంటి యాడ్‌ చూసి తాను మోసపోయానంటూ ఓ యువతి కన్జ్యూమర్‌ ఫోరమ్‌ను ఆశ్రయించింది. తనకు జీవిత భాగస్వామిని వెదకలేకపోయిన సదరు మ్యాటిమొనీ నుంచి 70 వేల రూపాయల పరిహారం పొందింది.

వివరాలు.. చండీగఢ్‌లోని సెక్టార్‌ 27 నివాసి అయిన ఓ యువతి రెండేళ్ల క్రితం వెడ్డింగ్‌ విష్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో తన వివరాలు అప్‌లోడ్‌ చేసింది. ఇందుకుగానూ 58, 650 రూపాయలు చెల్లించింది. రాయల్‌ ప్లాన్‌ కింద పన్నెండు నెలల పాటు ఆమె ప్రొఫైల్‌కు సరిపోయే యువకుల ప్రొఫైల్స్‌ను ఎంపిక చేసి వారితో మాట్లాడేలా ఏర్పాట్లు చేసింది సదరు మ్యాట్రిమొని. ఈ క్రమంలో సుమారు 21 మంది ప్రొఫైల్స్‌ చూసిన ఆ యువతికి ఒక్కరు కూడా నచ్చలేదు. దీంతో విసిగెత్తిపోయిన ఆమె.. 2016, జూన్‌ 2న కన్జ్యూమర్‌ కోర్టులో ఫిర్యాదు చేసింది. నెలరోజుల తర్వాత లీగల్‌ నోటీసులు రావడంతో విషయాన్ని గ్రహించిన మ్యాట్రిమొని యాజమాన్యం ఆమెకు మరలా ప్రొఫైల్స్‌ పంపడం ప్రారంభించింది. కానీ అవి కూడా ఆమెకు నచ్చకపోవడంతో కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేసే సమయంలో చెల్లించిన ఫీజుకు తోడు అదనంగా 11 వేల రూపాయలు యువతికి చెల్లించాలంటూ బుధవారం కోర్టు ఆదేశించింది.

ఉద్దేశపూర్వరంగానే ఫిర్యాదు చేసింది...!
ఎన్ని ప్రొఫైల్స్‌ పంపినా తిరస్కరించిన ఆ యువతి ఉద్దేశపూర్వకంగానే తమకు చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించిందని మ్యాట్రిమొని యాజమాన్యం వాదించింది. ‘ఎవరైనా కావాలని ఎందుకు అలా చేస్తారు. ఆమెకు సరిపోయే ప్రొఫైల్స్‌ మీరు పంపించనందు వల్లే ఫిర్యాదు చేసింది. సరైన జీవిత భాగస్వామిని వెదుకుతామని చెప్పి అలా చేయకపోవడం మీ తప్పే కదా’  అంటూ కోర్టు పేర్కొనడంతో షాక్‌ తినడం వారి వంతైంది.

మరిన్ని వార్తలు