మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై దాడి

16 Oct, 2017 15:33 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : గోవధను అడ్డుకున్నందుకు బెంగళూరులో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు  ఊహించని పరిణామం ఎదురైంది. మాకే అడ్డుపడతావా అంటూ సుమారు 150మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, విచక్షణారహితంగా కొట్టి ...కారును ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నందిని తల, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. దాడి నుంచి తేరుకున్న  ఆమె...ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.....కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వారిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.

కాగా నగర శివారులోని తలఘట్టపుర పరిధిలోని టిప్పు సర్కిల్‌ కసాయిఖానా వద్ద సాగే గోవధను అడ్డుకునేందుకు తాను  ఇద్దరు కానిస్టేబుల్స్‌తో కలిసి అక్కడకు వెళ్లినట్లు నందిని తెలిపారు. అయితే అప్పటికే అక్కడ పెద్ద గుంపు ఉందని, ఒక్కసారిగా వారంతా తమపై విరుచుకుపడ్డారన్నారు. దీంతో తనతో వచ్చిన కానిస్టేబుల్స్‌ అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. మరోవైపు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై దాడిని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఖండించారు. బెంగళూరులో శాంతిభద్రతలు క్షీణించాయనటానికి ఇదో ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ దాడి సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మహిళను కొట్టి కారును ధ్వంసం చేసిన వీడియో

మరిన్ని వార్తలు