ప్రాణాలు కాపాడినవ్‌.. జవాన్‌కు పాదాభివందనం!

10 Aug, 2019 19:06 IST|Sakshi

ముంబై : కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఒకచోట కాకుంటే మరోచోట వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రలో వరదలు ముంచెత్తుతున్నాయి.  ముఖ్యంగా వరదల ప్రభావంగా తీవ్రంగా ఉన్న సంగ్లీ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, నేవీ, కోస్ట్‌ గార్డ్‌ దళాలు సహాయ చర్యల్లో పాలుపంచుకుంటూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇదే జిల్లాలో పడవ బోల్తా పడి 14 మంది మరణించిన సంగతి తెలిసిందే. 

సంగ్లీ జిల్లాలో జవాన్లు ముమ్మరంగా చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. జర్నలిస్టు నీరజ్‌ రాజ్‌పుత్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఈ జిల్లాకు సంబంధించిన ఓ భావోద్వేగమైన వీడియోను పంచుకున్నారు.  వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న ప్రజలను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నందుకు ఆర్మీ అధికారి కాళ్లుమొక్కి ఓ మహిళ  కృతజ్ఞత చాటుకున్నారు. ఆపదలో ఆదుకుంటున్న జవాన్ల పట్ల ఆమె చూపిన కృతజ్ఞతాభావం నెటిజన్లను కట్టిపడేస్తోంది. పురాతన సంప్రదాయాలు పల్లెల్లో ఇంకా సజీవంగానే ఉన్నాయని, కృతజ్ఞతాభావం చాటడంలో పల్లెవాసులు ముందుంటారని నెటిజన్లు కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు