‘మీటూ’ అంటున్న మహిళా బీట్‌ రిపోర్టర్లు

13 Oct, 2018 16:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు.. పెళ్లి ఎందుకు చేసుకోవు?.....నాకే పెళ్లి కాకపోతేనా నిన్నే పెళ్లి చేసుకునేవాణ్ని.. ఈ దుస్తుల్లో దుమ్మురేపుతున్నావు.. ఆహా! ఏం దుస్తులు, ఏం అందం, అదరగొడుతున్నావ్‌....నీవు వాడే పర్‌వ్యూమ్‌ ఏమిటీ, మత్తెక్కిస్తోంది!....నాతో పడుకుంటే నిన్ను స్టార్‌ను చేస్తా!......ఇలా మాటలతోని పొడవడమే కాకుండా చూపులతోనే బట్టలను చింపేసేలా చూస్తారట! వారెవరో కాదు, రాజకీయ నాయకులు, పోలీసు, పౌర ఉన్నతాధికారులు. వారి మాటలకు చూపులకు బలవుతున్నది బీట్‌ రిపోర్టర్లుగా టీవీల్లో, పత్రికల్లో పనిచేస్తున్నSమహిళా జర్నలిస్టులు.

బీట్‌ రిపోర్టర్లు వార్తా సేకరణ కోసం పార్టీల నాయకులు, పోలీసు ఉన్నతధికారులు, పౌర ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినప్పుడు తమకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తోటి మీడియాతో పంచకున్నారు. ముఖ్యంగా పోలీసులు, ఆ తర్వాత పోలీసు అధికారుల నుంచే తమకు ఇలాంటి లైంగిక వేధింపులు ఎక్కువగా ఎదురవుతున్నాయని, పౌర ఉన్నతాధికారుల నుంచి తక్కువని ముఖ్యంగా ఇంగ్లీషు, హిందీ మీడియాలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులు చెప్పారు. ఏదైన రహస్య సమాచారం లేదా జీవో కాపీలు కాఫాలన్నప్పుడు ఉన్నతాధికారులు ‘మరి నాకేమిస్తావు?’ అంటూ అదోరకంగా అడుగుతున్నారని అన్నారు.

చాలా మంది మహిళా జర్నలిస్టులకు ఆఫీసుల్లో బాస్‌ నుంచి, తోటి జర్నలిస్టుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతుంటే బీట్‌ జర్నలిస్టులకు విధి నిర్వహణలో కూడా ఇలా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయట. ఢిల్లీలో అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసుగా పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఓ రోజు ఆయన కార్యాలయంతో తనను గట్టిగా హత్తుకున్నారని, తాను ఎలాగో తప్పించుకొని పారిపోయి వచ్చానని ఢిల్లీ పత్రికలో క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా జర్నలిస్టు ఆరోపించింది. సదరు అధికారి ఆ తర్వాత ‘భలే మత్తుగా ఉంది. నీవు వాడే పర్‌వ్యూమ్‌ ఏమిటీ?’ అంటూ సెల్‌ఫోన్‌ మెస్సేజ్‌ పంపించారని, ఆ తర్వాత ఆ అధికారిని తానెప్పుడు కలువలేదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మహిళా జర్నలిస్ట్‌ తెలిపారు.

రాజకీయ నాయకులకంటే వారి సహాయకారుల నుంచి ఎక్కువ లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని టీవీ ఛానల్‌ తరఫున ముంబైలో పనిచేస్తున్న పొలిటికల్‌ బీట్‌ రిపోర్టర్‌ ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివద్ద పర్సనల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అర్థరాత్రి ఫోన్‌చేసి ఏం చేస్తున్నావు? అంటూ మొదలుపెట్టి, నిద్ర పట్టడం లేదా? నేను రానా! అన్న వరకు మాట్లాడుతూ వేధిస్తాడట. తెల్లారి ఆయన కార్యాలయానికి వెళితే ఏం తెలియనట్లు మాట్లాడుతాడని ముంబై మహిళా జర్నలిస్టు ఆరోపించారు. ఇలా వేధింపులకు గురికావాల్సి వస్తోందని ఆమె ఎడిటర్‌కు ఫిర్యాదు చేస్తే ‘తెలివిగా తప్పించుకోవాలని లేదా సర్దుకు పోవాలి’ అని సలహాలు ఇస్తారట. కొందరు బీట్‌ మహిళా జర్నలిస్టులకు సొంత ఆఫీసులో, బయట విధి నిర్వహణలో, ఇతర మీడియా తరఫున వచ్చే మేల్‌ జర్నలిస్టులతో కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయట. ‘నాతో పడుకుంటే నిన్న స్టార్‌ను చేస్తా’ అని ఢిల్లీలోని ఓ హిందీ పత్రికలో క్రైమ్‌ బ్యూరో చీఫ్‌ తనను వేధించినట్లు అదే పత్రికలో క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్‌ ఆరోపించారు. ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు లాంటి నగరాల్లో మహిళా రిపోర్టర్లను ఎవరిని కదలించినా ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరితోని లైంగిక వేధింపులు ఎదురయినట్లు చెబుతున్నారు. ఇదే విషయమై తమ ఆఫీసుల్లో ఫిర్యాదు చేస్తే తమను ‘ట్రబుల్‌ మేకర్స్‌’గా ముద్ర వేస్తున్నారని వారు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు