మహిళా ఖైదీలకు అవస్థలే

8 Sep, 2014 01:27 IST|Sakshi

ఎన్‌సీఆర్‌బీ గణాంకాల్లో వెల్లడి
 
ఢిల్లీ: మహిళా ఖైదీలకు జైళ్లలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా మొత్తం జైళ్లలో మహిళా ఖైదీల కోసం 2 శాతం మాత్రమే జైళ్లను కేటాయించారు. ఆయా జైళ్లలో 18 శాతం మహిళలకు ఎలాంటి సౌకర్యాలు లేవని నేషనల్ క్రైమ్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం...దేశవ్యాప్తంగా ఉన్న 1,394 జైళ్లలో 20 మహిళా జైళ్లు ఉండగా అందులో 3,200 మంది మహిళా ఖైదీలు శిక్షలు అనుభవిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా మొత్తం మహిళా ఖైదీల సంఖ్య మాత్రం 16,951గా ఉండటం గమనార్హం. మరోవైపు మహిళా ఖైదీల సంఖ్యతో పోలిస్తే మహిళా పోలీసు సిబ్బంది సంఖ్య 25 శాతంకన్నా తక్కువగా  ఉంది. 2012 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 3,935 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. 

ప్రతి 245 మంది మహిళా ఖై దీలకు ఒక సైకాలజిస్ట్ లేదా కౌన్సెలర్ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా 105 మందికి ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. 2012లో 55 మంది మహిళా ఖైదీలు మృతిచెందగా వీరిలో 47 మంది సహజ మరణం పొందారు. ఐదుగురు ఆత్మహత్యలు చేసుకోగా, ముగ్గురు బయటి వ్యక్తుల దాడిలో మృతిచెందారు. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు, కేరళలలో మూడేసి మహిళా జైళ్లు ఉండగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో రెండు చొప్పున మహిళా జైళ్లు ఉన్నాయి. అదేవిధంగా బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఒక్క మహిళా జైలు మాత్రమే ఉంది.
 

మరిన్ని వార్తలు