ఫిట్‌నెస్‌ లెవెల్స్‌లో మగువలే మేటి

27 Aug, 2017 19:20 IST|Sakshi
ఫిట్‌నెస్‌ లెవెల్స్‌లో మగువలే మేటి

టొరంటోః మహిళలతో పోలిస్తే పురుషులే శారీరకంగా బలవంతులైతే కావచ్చు కానీ కండర పటుత్వం, శక్తిలో మగువలే శక్తివంతులని ఓ అధ్యయనం తేల్చింది. ఒకే తరహా వ్యాయామం చేసిన అనంతరం అదే వయసు కల పురుషులతో పోలిస్తే స్త్రీలు దీటుగా వాటిని తట్టుకోగలుగుతున్నారని కెనడాకు చెందిన బ్రిటిష్‌ కొలంబియా వర్సిటీ పరిశోధకులు గుర్తించారు.

ఒకే వయసు కలిగిన ఎనిమిది మంది పురుషులు, తొమ్మిది మంది స్త్రీలను ఎంచుకున్న పరిశోధన బృందం వారితో శారీరక వ్యాయామం చేయించింది. వ్యాయామం​ చేసే సమయంలో సెన్సర్ల ద్వారా వారి శారీరక కదలికలను రికార్డు చేసింది. వ్యాయామం చేసే సందర్భంలో, వ్యాయామం అనంతరం పురుషులతో పోలిస్తే మహిళల వేగం, కదలికలు మెరుగ్గా ఉన్నాయని వారి పరిశోధనలో వెల్లడైంది.

వ్యాయామం అనంతరం సాధారణ స్థితిలోకి వచ్చే సమయం కూడా పురుషుల్లో ఎక్కువగా ఉంటే మగువల్లో తక్కువగా ఉందని తేలింది. పురుషుల కన్నా మహిళల్లో ఫిట్‌నెస్‌ లెవెల్స్‌ తక్కువగా ఉంటాయనే సందేహాలను తమ అధ్యయనం పటాపంచలు చేసిందని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు